రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే ఈనెల 7వ తేదీ నుంచి మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ సేవలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గత నెల 10వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేశామన్నారు. ఈ క్రమంలో గత నెల చివరి నాటికి 22 కార్యాలయాల్లో సగటున 866 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేశామన్నారు. గురువారం సచివాలయంలోని తమ కార్యాలయంలో స్టాంప్స్, రిజిస్ట్రేషన్ విభాగంపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండో విడతలో రంగారెడ్డి జిల్లాలోని ఫరూక్ నగర్ , షాద్‌నగర్, మహేశ్వరం, వనస్ధలిపురం, షేర్ లింగంపల్లి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఉప్పల్, ఘట్‌కేసర్, నారప్పల్లి, మల్కాజ్‌గిరి, జనగాం, ఘన్‌పూర్, నర్సంపేట, బీబీనగర్, అదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల,పెద్దపల్లి, కల్వకుర్తి , వనపర్తి, గద్వాల్, గజ్వేల్ మెదక్ జిల్లాలో సిద్దిపేట అర్భన్, రూరల్, రంగారెడ్డి వరంగల్ హైదరాబాద్, హైదరాబాద్ సౌత్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం 22 కార్యాలయాల్లో కొనసాగుతోన్న స్లాట్ బుకింగ్ విధానంలో వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్లాట్ బుకింగ్ విధానం అమలు అవుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి పోస్ట్ కార్డుద్వారా అభిప్రాయాలను సేకరించగా 94 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని అధికారులు మంత్రికి ఈసందర్భంగా వివరించారు. పోస్టు కార్డులో ఉన్న ఫోన్ నెంబర్‌తో చంపాపేట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న విష్ణుగౌడ్ అనే వ్యక్తితో మంత్రిగారు స్వయంగా ఫోన్‌లో మాట్లాడి స్పందన తెలుసుకున్నారు. స్లాట్ బుకింగ్‌కు అవసరమైన ఇంటర్నెట్ స్పీడ్‌ను పెంచుకోవాలని సూచించారు. వచ్చే నెల 3వ వారం నాటికి రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయడానికి ఆధార్ -ఈ సంతకం ప్రవేశపెడుతున్నామని వీలైనంత త్వరితగతిన అమలులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. కాగా స్లాట్‌బుకింగ్ విధానం విజయవంతం కావడంలో అధికారుల పాత్ర ప్రశంసనీయం అన్న మంత్రి.. ఆ సేవలు అందించిన అధికారులు, సిబ్బందిని అభినందించారు.ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ ఐజీ జ్యోతి బుద్దప్రకాష్, సిసిఎల్ఎ సెక్రటరీ మకరంద్, మీసేవ డైరెక్టర్ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.