Tuesday, March 11, 2025

ఫైలు కదలాలంటే ఫైసలివ్వాల్సిందే….!

  • ఫైలు కదలాలంటే ఫైసలివ్వాల్సిందే….!
  • హెచ్‌ఎండిఏ ప్లానింగ్, ఇంజనీరింగ్‌లో భారీగా అవినీతి
  • ఇంజనీరింగ్ విభాగం అవినీతిపై ఏసిబికి ఫిర్యాదు
  • రానున్న రోజుల్లో మరికొందరిపై కేసులు నమోదయ్యే అవకాశం

హెచ్‌ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్టు, విచారణ హెచ్‌ఎండిఏలో పనిచేసే పలువురు అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. ఆయన అరెస్ట్‌తో జిహెచ్‌ఎంసీ, టౌన్ ప్లానింగ్, సిడిఎంఏ అధికారుల్లో టెన్షన్ మొదలైంది. బాలకృష్ణ ప్రలోభాలకు గురైన అధికారుల్లో గుబులు మొదలయ్యింది. హెచ్‌ఎండిఏ పరిధిలోని బాలకృష్ణ అనుమతి ఇచ్చిన ప్రాజెక్టులకు క్లియర్ చేసిన ఏఎంయూడీ అధికారులు సైతం భయపడిపోతున్నారు. ఇప్పటికే హెచ్‌ఎండిఏలోని ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న పలువురు ప్లానింగ్ అధికారులు సైతం తమకు ఈ కేసు చుట్టుకుంటుందోనన్న భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన హెచ్‌ఎండిఏ డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో ఆయన దగ్గర పనిచేసిన పలువురు ప్లానింగ్ అధికారులు కూడా పలు లేఔట్ యజమానుల నుంచి ప్లాట్‌లను, డబ్బును ముడుపులుగా తీసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హెచ్‌ఎండిఏలోని మరో వింగ్ ఇంజనీరింగ్‌లోనూ భారీగా అవినీతి జరిగిందని వాటిపై కూడా విచారణ జరిపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఫైల్ కదలాలంటే ఏజెన్సీ ద్వారానే….

హెచ్‌ఎండిఏలోని ప్లానింగ్ విభాగంలో ఫైల్ కదలాలంటే ఏజెన్సీ ద్వారా వెళ్లాలి. అధికారులకు నచ్చిన ఏజెన్సీల ద్వారా వెళితే ఎలాంటి సమస్య ఉన్నా దానికి ఒక రేటును ఫిక్స్ చేసి వెనువెంటనే అనుమతులను మంజూరు చేస్తున్నట్టుగా గత ప్రభుత్వానికి సైతం ఫిర్యాదులు అందాయి. అయినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములను ఆక్రమించుకున్నా వాటికి సైతం లే ఔట్‌లుగా అనుమతులు ఇవ్వడం అప్పటి నుంచి హెచ్‌ఎండిఏ అధికారులకు అలవాటుగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

లే ఔట్‌లోని ప్లాట్‌లు కావాలి….

శివార్లలో లే ఔట్లకు అనుమతులు ఇవ్వాల్సి వస్తే ఆ వెంచర్‌లో ప్లాట్ల రూపంలో లేదా డెవలప్‌మెంట్ చేయడానికి తమ వారికి అవకాశం ఇవ్వాలని వెంచర్‌ల యజమానులకు ప్లానింగ్ అధికారులు ఆదేశాలు జారీ చేయడం కూడా ఇక్కడ నిత్యతంతుగా మారింది. ఇప్పటికే దీనిపై ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు అందాయి.

ఇద్దరూ విదేశాలకు వెళ్లాలనుకునేలోపు…

అయితే బాలకృష్ణ డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో కొందరు ఆయన చెప్పిందే వేదంగా పనిచేశారు. అలాంటి వారిలో ఇద్దరు అధికారులు మార్చి నెలాఖరులో రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వారిద్దరూ ఫిబ్రవరి నుంచి సెలవుపై విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణపై ఎసిబి కేసు నమోదు చేయడంతో వారి పరిస్థితి ఇప్పుడు ఆగమ్యగోచరంగా మారింది. తాము కూడా ఈ కేసులో ఇరుకుతామన్న భయాందోళనతో ఉన్నట్టుగా తెలిసింది. అయితే బాలకృష్ణ విచారణ తర్వాత మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంజనీరింగ్‌లోనూ భారీ అవినీతి

అయితే హెచ్‌ఎండిఏను ప్రక్షాళన చేయాలని గత ప్రభుత్వం భావించినా అది సాధ్యం కాలేదు. అయితే ఒక్క ప్లానింగ్‌లో కాకుండా ఇంజనీరింగ్ విభాగంలోనూ భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో చేపట్టిన పలు నిర్మాణాలు, పార్కుల అభివృద్ధి, కొత్త పార్కుల నిర్మాణంలోనూ ఇంజనీరింగ్ అధికారులు భారీగా అవినీతికి పాల్పడ్డారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే హెచ్‌ఎండిఏలోని ఇంజనీరింగ్, ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటేషన్‌తో పాటు రిటైర్డ్ అధికారులు ఎక్కువ మంది ఇంతకాలం పనిచేశారు. అయితే వారు ఇప్పటివరకు అందినకాడికి దండుకున్నట్టుగా తెలిసింది. దీంతో ఇంజనీరింగ్ విభాగంలో చోటు చేసుకున్న అవినీతిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్టుగా సమాచారం.

ఎసిబి వద్ద హెచ్‌ఎండిఏ అవినీతి అధికారుల చిట్టా

ఇప్పటికే బాలకృష్ణను ఏసిబి అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో పలువురు అవినీతి అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్టుగా తెలిసింది. తాము చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి నానాతంటాలు పడుతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే హెచ్‌ఎండిఏలో జరుగుతున్న అవినీతి గురించి ఏసిబి దృష్టికి వెళ్లిందని చాలామంది ప్లానింగ్ అధికారుల చిట్టా కూడా వారి వద్ద ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో ఎంతమంది అవినీతి అధికారులను ఏసిబి పట్టుకుంటుదన్న దానిపై ఆసక్తి నెలకొంది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com