హైదరాబాద్ లో భారీ చోరీ జరిగింది. నగర శివారులోని ఐటీ కారిడార్ లో ఏకంగా 2 కోట్ల రూపాయలు చోరీకి గురయ్యాయి. భూమి అమ్మగా వచ్చిన 2 కోట్ల రూపాయలను ఇంట్లో దాయగా దొంగలు పడి డబ్బును ఎత్తుకెళ్లారు. 2 కోట్లతో పాటు బీరువాలో దాచుకున్న 28 తులాల బంగారు ఆభరణాలను కూడా దోచుకెళ్లారు దొంగలు. ఐటీ కారిడార్ లోని మక్త గ్రామంలో నాగభూషణం నివాసం ఉంటున్నాడు. ఇటీవల శంకర్ పల్లిలో తనకున్న 10 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టగా మంచి ధర రావడంతో అందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఇందులో భాగంగా 2 కోట్ల 2 లక్షలు అడ్వాన్స్ గా తీసుకున్నాడు. ఈ డబ్బును నాగభూషణం ఇంట్లోనే బీరువాలో దాచాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి నాగభూషణం ఇంట్లో దొంగలు పడ్డారు. బీరువాలోని సొమ్మంతా దోచుకెళ్లారు. ఇంటి తాళాలు, బీరువా తాళాలు పగలగొట్టి 2 కోట్ల డబ్బు, 28 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారని బాధితుడు నాగభూషణం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానంతో నాగభూషణం డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దొంగతనం జరిగిన తీరును పరిశీలించి, పరారైన దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.