భదాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ యువకుడు తన మాతృభాషపై ఉన్న ప్రేమను వినూత్నంగా వ్యక్తం చేశాడు. తన వెడ్డింగ్ కార్డును కోయ వ్యవహారంలో తెలుగులో ఫ్రింట్ చేయించి బంధువులు, స్నేహితులకు ఆహ్వానాలు పంపాడు. అది చూసిన వారు ఐడియా అదిరిందని.. కొనియాడుతున్నారు. ప్రస్తుతం ఆ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెడ్డింగ్ కార్డులో వధువరులు, ముహుర్తం, ఆతిథులకు ఆహ్వానం, విందు ఇలా ప్రతిదీ కూడా కోయ భాషతో తెలుగు వ్యవహారంలో అచ్చు వేయించి బంధువులు, స్నేహితులు, సన్నిహితులకు ఆహ్వానాలు పంపించాడు. పెళ్లి కార్డు కోయ వ్యవహారంలో భలే ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘మూడు వంతులకుపైగా పదాల అర్థం తెలియక పోయినా, చదువుతుంటే చాలా సంతోషమనిపించింది.’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. ‘అర్ధం కాలే కానీ చానా మంచిగున్నది.. ఐడియా అదిరింది’ అని మరో నెటిజన్ తన అభిప్రాయన్ని వ్యక్తం చేశాడు. ‘మంచి ఆలోచన.. వారి భాషను మర్చిపోనివ్వకుండా చేస్తున్న ప్రయత్నం అభినందనీయం’ అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు.
‘కోయారే కోయారే కోయా… బామారే చందమామా.. కోయ్ కోయ్…కొడ్నీ కోయి’ ఈ పాట సోషల్ మీడియాలో ఎంతగా ట్రెండ్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా.. కోయ్.. కోయ్ పదాలే. వినడానికి చాలా కొత్తగా ఉండటంతో నెటిజన్లకు అమితంగా నచ్చింది. ఖమ్మం జిల్లా మారుమూల అటవీప్రాంతంలోని కోయ జాతికి చెందిన మీసాల గురప్ప అనే ఫాస్టర్ ఓ స్టేజీపై ఈ పాట పాడటంతో వైరల్‌గా మారింది. ఈ పాట తన మాతృబాష కోయలో ఉందని… దీన్ని తన అడవి జాతికోసమే రాసానని గురప్ప చెప్పారు. పాటలోని ప్రతి పదం కోయ భాషలో ఉందని అన్నారు. ఇలా కోయ భాషలోని కొన్ని పదాలు కోయ్ కోయ్ పాట ద్వారా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజాగా.. ఓ కోయ యువకుడు మాతృభాషపై తనకున్న అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి లైఫ్‌లో స్వీట్ మెమరీ కాగా.. వెడ్డింగ్ కార్డ్ మొదలుకొని పెళ్లి మంటపం వరకు ప్రతిదీ కూడా స్పెషల్‌గా ఉండాలనుకుంటాం. అందుకే వినూత్నంగా ఆలోచించటంతోపాటు తన మాతృభాషపై ఉన్న మమకారంతో పెళ్లి కార్డును వెరైటీగా ప్రింట్ చేయించాడు. ఇప్పుడి ఇన్విటేషన్ కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సంజయ్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్ అనే కోయ యువకుడికి అదే జిల్లా లక్ష్మీదేవిపల్లికి చెందిన వినితతో పెళ్లి నిశ్చమయైంది. వచ్చే నెల 2వ తేదీ పెళ్లి ముహూర్తం ఖరారు కాగా.. మాతృభాషపై మమకారం చూపించటంతో పాటు వినూత్నంగా ఉండేలా శ్రీనివాస్ తన పెళ్లి పత్రికను కోయ వ్యవహారంలో ఫ్రింట్ చేయించాడు.