Sunday, September 29, 2024

మెదక్ బంద్ ప్రశాంతం

  • ఘర్షణలపై యంత్రాంగం అలర్ట్​
  • ఇరువర్గాలకు చెందిన 45 మందిపై కేసు
  • మొత్తం 8 కేసులు నమోదు చేసిన పోలీసులు
  • ఇరు వర్గాలతో శాంతి సమావేశం
  • మెదక్​లో పర్యటించిన ఐజీ రంగనాథ్​
  • ఘటనపై ఆరా తీసిన కేంద్రమంత్రి బండి సంజయ్​
  • మెదక్​ వెళ్లేందుకు రాజాసింగ్​ యత్నం.. అరెస్ట్​ చేసిన పోలీసులు

మెదక్​ పట్టణంలో నెలకొన్న ఘటనపై ప్రభుత్వం అలర్ట్​ అయింది. శనివారం జరిగిన ఘటనల నేపథ్యంలో.. ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో బంద్​కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బీజేపీ పిలుపుతో ఆదివారం మెదక్ పట్టణ బంద్ ప్రశాంతంగా జరిగింది. శనివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ, పరస్పర దాడుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఈ క్రమంలో బీజేపీ, బీజేవైఎం ఆదివారం మెదక్ పట్టణ బంద్​కు పిలుపునిచ్చాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు, పెట్రోల్​ బంక్​లు, హోటళ్లు, దుకాణాలు స్వచ్చందంగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు యదావిధిగా నడిచాయి. బస్టాండ్​లు, చౌరస్తాలు మజీద్ ల వద్ద పోలీస్​ పికెట్​లు ఏర్పాటు చేయడంతోపాటు, పట్టణంలో పెట్రోలింగ్​ నిర్వహించారు. మల్టీజోన్​ ఐజీ రంగనాథ్​, ఎస్పీ బాలస్వామితో కలిసి పరిస్థితి సమీక్షించారు. శనివారం జరిగిన సంఘటనతో సంబంధం ఉన్న ఇరువర్గాలకు చెందిన వారిని గుర్తిస్తున్నారు.

ఇరు వర్గాలతో శాంతి సమావేశం
ఇరువర్గాల మధ్య గొడవల నేపథ్యంలో ఆదివారం మెదక్​ పట్టణ పోలీస్​ స్టేషన్​లో పీస్​ కమిటీ మీటింగ్​ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన మల్టీజోన్​ ఐజీ రంగనాథ్​ మాట్లాడుతూ ఒక వర్గం మరో వర్గాన్ని రెచ్చగొట్టుకోవడం, గొడవలు పడటం, దుకాణాలు, ఆసుపత్రులపై దాడులు చేయడం మంచి పద్దతి కాదని హితవు పలికారు. ఇలాంటి సంఘటనల వల్ల అమాయకులు బలవుతారన్నారు. సమాజంలోని అన్ని వర్గాల వారు శాంతి సామరస్యంతో మెలగాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే పోలీసుల దృష్టికి తీసుకువచ్చి సామరస్యంగా పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, బీజేపీ నాయకులు నందారెడ్డి, పట్టణ ఎంఐఎం అధ్యక్షులు ఇశ్రత్ మాట్లాడుతూ మెదక్ పట్టణంలో హిందూ, ముస్లింలు కలిసి మెలిసి ఉంటారని, ఈనాడు ఘర్షణ పడిన సందర్భాలు లేవన్నారు. ఈ సంఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ సమావేంలో ఎస్పీ బాలస్వామి, ఏఎస్పీ మహెందర్, డిఎస్పిలు డా. రాజేష్, వెంకట్ రెడ్డి, మాజీ చైర్మెన్​ బట్టి జగపతి, కౌన్సిలర్​ లక్ష్మీనారాయణ గౌడ్, బీజేపీ జిల్లా నాయకులు గడ్డం కాశీనాథ్, మైనార్టీ నాయకులు ఖాజా మొహినొద్దీన్, జావేద్​ మౌలానా, భారత్​ ఆరీఫ్, హఫీజ్, అంజద్, అఫ్జల్, అహ్మద్​ బేగ్, షాహెద్​ అలీ తదితరులు పాల్గొన్నారు. ​

8 కేసులు.. 14 మంది అరెస్ట్
మెదక్ పట్టణంలో శనివారం జరిగిన ఇరువర్గాల ఘర్షణ, దాడుల నేపథ్యంలో పోలీసులు మొత్తం 8 కేసులు నమోదు చేశారు. శనివారం రాత్రి 3 కేసులు నమోదు కాగా, ఆదివారం మరో 5 కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో ఇప్పటి వరకు మొత్తం 14 మందిని అరెస్ట్ చేశారు. మరి కొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇరు వర్గాల ఘర్షణకు సంబంధించిన కేసులో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ సహా 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. మొత్తంగా 8కేసులు నమోదు చేసి ఇరు వర్గాలకు చెందిన 45 మందిని గుర్తించినట్లు మల్టీ జోన్ ఐజీ రంగనాధ్ వెల్లడించారు. ఆదివారం మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మీడియాతో మాట్లాడుతూ గొడవల వల్ల అమాయకులు నష్టపోయారని, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఏ పార్టీకి చెందిన వారైనా సరే ఎవరిని వదిలిపెట్టమని, కొంతమంది స్వార్థం కోసం ఇరు వర్గాల ఘర్షణ జరిగిందన్నారు. సామాన్యులు మతసామరస్యం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారని, వారికి చట్ట పరంగా భద్రత కల్పిస్తామని చెప్పారు. మెదక్ పట్టణంలో నల్ల పోచమ్మ బండ్ల ఊరేగింపు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు.

అదేవిధంగా ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.సీసీ కెమెరాలు నిశితంగా పరిశీలించి కేసులు బుక్ చేస్తామని, ఇప్పటి వరకు ఇరు వర్గాల నుండి ఘర్షణకు కారకులైన వారిలో45 మందిని గుర్తించామని 9 మంది హిందువులపై కేసు నమోదు చేశామని వివరించారు. శనివారం జరిగిన ఘర్షణలో పోలీసులు స్పందించనట్లు తెలితే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఐజీ రంగనాధ్ స్పష్టం చేశారు. సొంతంగా ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని, సోషల్ మీడియాలో అనవసరమైన వదంతులు పెట్టొద్దన్నారు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సెక్షన్ 34 ,149 ప్రకారం గుంపులో ఉంటే బాద్యులు అవుతారన్నారు. ఘర్షణలో ఇరు వర్గాల వారు ఓవరాక్షన్ చేశారని అభిప్రాయపడ్డారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ డా. బాలస్వామి, ఎఎస్పీ మహేందర్, డిఎస్పీలు డా. రాజేష్, వెంకట్ రెడ్డి ఉన్నారు.

మెదక్ ఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరా
మెదక్ జిల్లా కేంద్రంలో జంతువధకు సంబంధించి రెండు వర్గాల మధ్య చెలరేగిన వివాదం నేపథ్యంలో మెదక్ పట్టణంలో చోటు చేసుకున్న అల్లర్లపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటనలో ఉన్న మంత్రి బండి సంజయ్ తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మెదక్ ఘటనపై పూర్వపరాలను అడిగి తెలుసుకున్నారు. సమాజంలో అశాంతిని నెలకొల్పే విధంగా ఎవరు వ్యవహరించినా వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బాధితుల పక్షాన పోలీసులు నిలబడటమే కాకుండా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. బాధితులపై అక్రమ కేసులు బనాయించడంకానీ, అమయాకులను ఇబ్బందులకు గురిచేసే చర్యలను కానీ చేపట్టొద్దని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు తీసుకునే చర్యల ఆధారంగానే మెదక్ లో పరిస్థితులు చక్కబడతాయని ఆయన వెల్లడించారు. శాంతిభద్రతలను కాపాడే విషయంలో ఏ ఒక్కరికీ కొమ్ముకాయకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పోలీసులను మంత్రి బండి సంజయ్ కోరారు.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు
గోషామహల్‌కు శాసనసభ్యుడు రాజా సింగ్‌ను పోలీసులు ఆదివారం శంషాబాద్ విమానాశ్రయంలో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. రాజా సింగ్ ఆదివారం ఉదయం ముంబై నుండి హైదరాబాద్ కు వచ్చారు. ఆయన మెదక్ జిల్లాకు వెళ్లనున్నాడని వార్తలు రావడంతో, పోలీసులు రాజాసింగ్ ను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి ఆయనను ఆర్‌జీఐ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆదివారం ఉదయం నుంచి సైబరాబాద్ పోలీసులు, స్థానిక పోలీసులు ఆర్‌జీఐ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో పెద్దఎత్తున మోహరించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular