తెలుగు సినీ జర్నలిస్టుల మధ్య కొత్త వివాదం మొదలైంది. చిరంజీవి పీఆర్వో, సంతోషం పత్రిక ఎడిటర్ కొండేటి సురేష్‌ను ప్రెస్మీట్లకు బహిష్కరిస్తున్నట్లు తెలుగు ఫిల్మ్ జర్నలిస్టుల అసోసియేష్ అంటే క్రిటిక్ అసోసియేషన్, పీఆర్వోలు ప్రకటించారు. గోవా ఇష్యూతో పాటుగా ఇటీవల సురేశ్ ప్రశ్నలతో సినీ నటులు, దర్శకులు ఇబ్బందులు పడుతున్నారనే సాకును చూపిస్తూ బహిష్కరణ వేటు వేశారు. ఈ బహిష్కరణ అంశం ఎలా ఉన్నా.. దీనిపై అసోసియేషన్, సురేశ్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది.
ఫిల్మ్ జర్నలిస్టుల విషయంలో చాలా నెగిటివ్ ప్రచారం కూడా ఉంది. దానిపై అసోసియేషన్ నిర్లక్ష్యంగా ఉంటుంది. ఎందుకంటే పొలిటికల్, సాధారణ జర్నలిస్టులతో పోలిస్తే.. సినిమా జర్నలిజంలో ఆరోపణలు కూడా ఎక్కువే. ఇక్కడ మహిళా జర్నలిస్టులను చులకన భావంతో చూస్తారనే టాక్. వారితో ఇతర జర్నలిస్టుల ప్రవర్తన కూడా కొంత హేయంగానే ఉంటుంది. దీనిపై గతంలో అసోసియేషన్‌కు ఫిర్యాదులు వచ్చినా ఎక్కడా చర్చలు లేవు. ఎందుకంటే అక్కడ కూడా కొంతమంది ఆధిపత్యమే కొనసాగుతున్నది. ఉద్యోగం అనేది తప్పలేని పరిస్థితుల్లో చిత్రసీమలో జర్నలిస్టులు పని చేస్తున్నారనే టాక్. మరోవైపు కొంతమంది పీఆర్వోల కారణంగా సినీ జర్నలిస్టులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తూనే ఉన్నది. అయితే, ముందుగా ఇక్కడి నుంచి సంస్కరణ చేయాలంటూ మీడియా జర్నలిస్టులో డిమాండ్.
ఇప్పుడేమవుతుంది..?
ప్రస్తుతం ఫిల్మ్ జర్నలిస్టుల అసోసియేషన్, తెలుగు క్రిటిక్ అసోసియేషన్, పీఆర్వోలు అందరూ కలిసి కో ఆర్డినేషన్ కమిటీ వేసినట్లుగా ప్రకటించారు. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ప్రెస్మీట్లకు టైమ్ స్లాట్స్‌తో పాటు ఈవెంట్లు, ప్రీమియర్ షోలకు సమయం నిర్ధారించారు. ఇదే సమయంలో సురేశ్ కొండేటిని బహిష్కరించారు. వీరంతా ఇటీవల గోవాలో జరిగిన సంతోషం అవార్డుల ఫంక్షన్ ఈవెంట్‌తో పాటుగా కొన్ని సందర్భాల్లో సురేశ్ ప్రశ్నలు మితిమీరుతున్నాయనే కారణాలను చూపించారు. నిజానికి, సంతోషం అవార్డుల ఫంక్షన్ కేవలం సురేశ్ సొంతంగా నిర్వహించేది కాదు. దాని వెనక ఎవరున్నారో తెలిసిందే. కానీ, పైకి మాత్రం సురేశ్ పేరును పెడుతున్నారు. అయితే, డిసెంబర్ 2న గోవాలో జరిగిన ఈవెంట్‌పై తమిళ, కన్నడ స్టార్లు, సినీ నటులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని కారణంగా చూపిస్తున్న అసోసియేషన్‌కు సురేశ్ కూడా సమాధానమిచ్చాడు. ఇదంతా తన సొంతం అనే విధంగా రిప్లై ఇచ్చారు. అసలు కో ఆర్డినేషన్ కమిటీ ఎవరు అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం సినీ జర్నలిస్టులో సినిమాల విషయం పక్కన పెడితే.. ఈ వివాదమే హాట్ టాపిక్‌గా మారింది.
ఇరు వర్గాల ఆరోపణలు, రిప్లైలు ఇలా ఉన్నాయి.
ఇది అసోసియేషన్ నిర్ణయం
డియర్ ఫ్రెండ్స్
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ & తెలుగు క్రిటిక్ అసోసియేషన్ మరియు పిఆర్వోలు అందరూ కలిసి కోఆర్డినేషన్ కమిటీ గా ఏర్పడి తీసుకున్న నిర్ణయాలు…
మీటింగ్ లో కొన్ని నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది..
1) ప్రెస్ మీట్ లకు టైమ్ స్లాట్ కేటాయించడం జరిగింది.
7am to 9am కొత్త సినిమాల ఓపినింగ్స్ కోసం.
అవసరం అనుకుంటే 9am స్లాట్ కూడా ఓపినింగ్ వాళ్లు వాడుకోవచ్చు..
1.9 am
2. 11am
3. 2 pm
4. 4 .30pm
5. 6.30pm
7.30pm తరవాత ప్రీమియర్ షో & ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి టైమ్..
ఆదివారం ప్రెస్ మీట్ లు లేకుండా చూడటం. ఇంకా ఎక్కువ ప్రెస్ మీట్ లు జరిగితే దానికి అనుగుణంగా ముందు రోజు టైం స్లాట్స్ నిర్ణయించడం జరుగుతుంది.
2) యూట్యూబ్ ఛానెల్స్ & సోషియల్ మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి వాటిని కూడా ఒక పద్దతి లోనికి తీసుకురావడం. వాళ్ళకి ఒక 🆔 కార్డ్ ఇచ్చి విధంగా నిర్ణయం. ఆ కమిటీ సభ్యులను ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తాం..
3) సురేష్ కొండేటి విషయం పై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) మనకు ఇచ్చిన లేటర్ పై కొంతకాలం సురేష్ కొండేటి ని ప్రెస్ మీట్ లకు దూరంగా ఉండాలి అని, కావాలి అంటే తన సంస్థ (సంతోషం) తరపున ప్రతినిధి పంపవచ్చు ఆని పిఆర్వోలు అందరూ తమ నిర్ణయం వెలిబుచ్చారు.
==
ఇది సురేశ్ రిప్లై
డియర్ వి. లక్ష్మీ నారాయణ…
నా మీద నిర్ణయం తీసుకున్నది కో-ఆర్డినేషన్ కమిటీ అని చెప్పారు. ఆ కమిటీ సభ్యులెవరో, వారిని ఎవరు నియమించారో చెబితే బాగుంటుంది. నేను మొన్న మీరు ప్రసాద్ లాబ్ లో పెట్టిన మీటింగ్ కు వచ్చాను… నా గురించి అక్కడ కొందరు విమర్శిస్తూ మాట్లాడినప్పుడు… నన్ను వేదిక మీదకు పిలిచి వివరణ అడిగి ఉండాల్సింది. అప్పుడే గోవాలో ఏం జరిగిందో? అందుకలా జరిగిందో వివరించే వాడిని. ఆ తర్వాత అయినా… కో-ఆర్డినేషన్ కమిటీని వేశాం… వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారని నా గురించి పోస్ట్ ఇలా గ్రూప్ లో పెట్టడానికి ముందే వ్యక్తిగతంగా చెప్పి ఉండాల్సింది. ఆ పని చేయకుండా… నేను మిమ్మల్ని ప్రశ్నించగానే.. ‘ఈ గ్రూప్ లో ఎటువంటి డిస్కషన్స్ కు ఆస్కారం లేదు’ అని పెట్టడంలో అర్థం ఏమిటీ?
నా కారణంగా తెలుగు సినిమా పరిశ్రమను, తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులను బూతులు మాట్లాడుతున్నారని మీరు చెబుతున్నారు. మరి నా గురించి కొన్ని వెబ్ సైట్స్, యూ ట్యూబ్ ఛానెల్స్ సంబంధం లేకుండా బూతులు రాస్తూ, థంబ్ నెయిల్స్ పెట్టినప్పుడు మీరు స్పందించలేదు. ఎందుకని? నా కంటే ముందు కొందరు పీఆర్వోల గురించి ఫిల్మ్ ఛాంబర్ లోనూ, నిర్మాతల మండలిలోనూ కొందరు నిర్మాతలు, నటీనటులు కూడా కంప్లైంట్ చేశారు. వారిని కూడా మీరు ఇలానే వివరణలు అడిగారా? వారి వ్యవహారశైలి గురించి పోస్ట్ పెట్టి ఏం చర్యలు తీసుకుద్దాం అని ఎవరినైనా అడిగారా? ఇవాళ నన్ను మాత్రమే ఇలా కార్నర్ చేస్తుంటే.. మనసులో ఏదో పెట్టుకుని టార్గెట్ చేస్తున్నారేమో అనిపిస్తోంది?
చివరగా ఒక్క మాట…
నా గురించి తీసుకున్న నిర్ణయం మీ ఒక్కళ్ళదే కాదని కో ఆర్డినేషన్ కమిటీదని, పీఆర్వోలు అందరూ నన్ను ప్రెస్ మీట్ కు కొద్ది రోజులు ఉండాలన్నారని మీరు చెబుతున్నారు. నేనూ లీడింగ్ పీఆర్వోనే కదా! ఎవరెవరో ఆ రోజు మీ కో-ఆర్డినేషన్ కమిటీ మీటింగ్ వచ్చారు… ఎవరెవరు నన్ను ప్రెస్ మీట్స్ కు రావద్దని అన్నారో చెప్పండి… నా మీద ఇలాంటి అభిప్రాయం వాళ్ళకు ఎందుకు కలిగిందో తెలుసుకుంటాను. మీరు చెప్పినట్టుగా నేను కో-ఆర్డినేషన్ మీటింగ్ కు తప్పకుండా వస్తాను… నా వాదన వినిపిస్తాను. కానీ మీరు ఈ మెసేజ్ పెట్టకముందు నా వాదన విని ఉండాల్సింది. మొన్న ఇండస్ట్రీకి జరిగిన పరువు నష్టం గురించి మీరు మాట్లాడుతున్నారు… ఇప్పుడు అసలు ఏర్పడని కో-ఆర్డినేషన్ కమిటీ పేరుతో మీరు ఇచ్చిన మెసేజ్ కారణంగా నాకు జరిగిన పరువు నష్టం గురించి ఏం చెబుతారు… దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు!?
మీ
సురేశ్ కొండేటి
==
మళ్లీ అసోసియేషన్ వివరణ
డియర్ సురేష్ కొండేటి,
1. ఈ నిర్ణయం కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయం..
2. గోవా లో జరిగింది నీ వ్యక్తిగతం కానీ, అవమానం జరిగింది సౌత్ ఇండియా సినీ ప్రముఖులకు . లుగు సినీ పరిశ్రమను తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ లను బూతులు మాట్లాడుతుంటే మాకు సంబంధం ఎందుకు ఉండదు.
3. ఇది నా ఒక్కడి నిర్ణయం కాదు,, ఇది కోఆర్డినేషన్ కమిటీ (ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, క్రిటిక్ అసోసియేషన్, పిఆర్వోలు) తీసుకున్న సమిష్టి నిర్ణయం.
4. ఈ గ్రూప్ లో ఎటువంటి డిస్కషన్ కి ఆస్కారం లేదు. రెండు మూడు రోజుల్లో నిన్ను కోఆర్డినేషన్ కమిటీ పిలిచి మాట్లాడటం జరుగుతుంది.