Sunday, December 29, 2024

వైద్య విద్యలో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని తెచ్చింది జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వ‌మే

  • పైగా కూట‌మి ప్ర‌భుత్వంపై బుర‌దజ‌ల్ల‌డం స‌మంజ‌స‌మేనా
  • రూ. 8540 కోట్ల‌కు గాను 1400 కోట్ల‌ను మాత్ర‌మే ఖ‌ర్చు చేశారు
  • విధ్వంసాన్ని సృష్టించి….వైద్య విద్య చ‌ద‌వాల‌న్న పేద‌ల క‌ల‌ల్ని ఛిద్రం చేశారు
  • గ‌త ప్ర‌భుత్వ అనాలోచిత‌, లోప‌భూయిస్ట‌మైన విధానాల వ‌ల్లే ఈ ప‌రిస్థితి దాపురించింది
  • రెండో సంవ‌త్స‌రం వైద్య విద్యార్థుల‌కు గ‌దుల్లేక షెడ్డుల్లో పాఠాలు చెప్పాల్సిన దుస్ధితిని తీసుకొచ్చారు
  • పులివెందుల వైద్య‌క‌ళాశాల‌లో 47.5 శాతం బోధ‌నా సిబ్బంది లేరు
  • ప్రభుత్వ వైద్య కళాశాల పై మండలిలో సభ్యుల ప్రశ్నలకు వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వివ‌ర‌ణ‌

అమరావతి, న‌వంబ‌ర్ 21: వైద్య విద్యలో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల‌కు సంబంధించి
గురువారం శాసనమండలిలో సభ్యులడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధానమిస్తూ గత ప్రభుత్వం చేసిన తప్పులకు తామెందుకు బాధ్యులమవుతామన్నారు. త‌మ‌కు ఇస్తామ‌న్న ఎంబిబిఎస్ సీట్ల‌ను వ‌ద్ద‌ని పేర్కొంటూ జాతీయ వైద్య మండ‌లికి ప్ర‌భుత్వం లేఖ రాసిన విష‌యం వాస్త‌వ‌మేనా అనే ప్ర‌శ్న‌కు స‌మాధానమిస్తూ అటువంటిదేమీ లేద‌న్నారు. ఇస్తామ‌న్న‌ వైద్య క‌ళాశాల‌ల్ని వ‌ద్ద‌నే స‌మ‌స్యే లేద‌న్నారు. రెండో విడ‌త‌లో మ‌ద‌న‌ప‌ల్లి క‌ళాశాల విష‌యంలో కూడా రూ.475 కోట్లకు గాను రూ.30 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు పెట్టార‌ని, మార్కాపురం క‌ళాశాల‌కు రూ.475 కోట్ల‌కు గాను రూ.46 కోట్లు ఖ‌ర్చు పెట్టార‌న్నారు. ఆదోని క‌ళాశాల విష‌యంలో కూడా కేవ‌లం 10 శాతం నిధుల్ని మాత్ర‌మే ఖ‌ర్చు పెట్టార‌న్నారు. గ‌త ప్ర‌భుత్వం వైద్య‌క‌ళాశాల‌ల నిర్మాణాన్ని ఈ విధంగా గాలికొదిలేస్తే ఇప్పుడెలా మొద‌లుపెట్టగ‌లమని మంత్రి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. గ‌త ప్ర‌భుత్వ అనాలోచిత‌, లోప‌భూయిస్ట‌మైన విధానాల వ‌ల్లే ఈ ప‌రిస్థితి దాపురించింద‌న్నారు.

రూ. 8,540 కోట్ల‌కు గాను రూ.1400 కోట్ల‌ను మాత్ర‌మే ఖ‌ర్చు చేసి, గ‌త జ‌గన్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం విధ్వంసాన్ని సృష్టించి, వైద్య విద్య చ‌ద‌వాల‌నుకున్న పేద‌ల క‌ల‌ల్ని ఛిద్రం చేసింద‌న్నారు. మొద‌టి విడ‌త కాలేజీల‌తో పాటు, రెండో విడ‌త‌లోని పులివెందుల వైద్య క‌ళాశాల‌లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని తెచ్చింది జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కాదా? అని వైసిపి స‌భ్యుల‌నుద్దేశించి మంత్రి ప్ర‌శ్నించారు. పైగా మాపై బుర‌ద‌జ‌ల్ల‌డం స‌మంజసం కాద‌న్నారు. విజ‌యన‌గ‌రం వైద్య క‌ళాశాల‌కు రూ.500 కోట్లు నాబార్డు నిధుల్ని కూడా కేవ‌లం రూ.103 కోట్లు ఖ‌ర్చు చేశార‌న్నారు. ఆ జిల్లా ప్ర‌జాప్ర‌తినిధులు, మంత్రుల‌కు అక్క‌డి వైద్య క‌ళాశాల పురోగ‌తి తెలుసుకోలేని స్థితిలో ఉన్నారా అని మంత్రి ప్ర‌శ్నించారు. గ‌తేడాది ప్రారంభించిన రాజ‌మండ్రి వైద్య క‌ళాశాల విష‌యంలో కూడా ఇదే జ‌రిగిందని, రూ.475 కోట్ల‌కు గాను కేవ‌లం రూ.28 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేశార‌న్నారు. అర‌కొర సౌక‌ర్యాల‌తో వైద్య క‌ళాశాలల్ని ప్రారంభించడం వ‌ల్లే ఈ ప‌రిస్థితి దాపురించింద‌న్నారు. రెండో సంవ‌త్స‌రానికొచ్చిన వైద్య విద్యార్థుల‌కు పాఠాలు చెప్ప‌డానికి గ‌దుల్లేవ‌ని, షెడ్లు వేసి పాఠాలు చెప్పాల్సిన దౌర్భాగ్యం నెల‌కొంద‌న్నారు. మెడిక‌ల్ కాలేజీ అన్నా, వైద్య విద్య అన్నా గ‌త ప్ర‌భుత్వానికి తెలుసా అని మంత్రి ప్ర‌శ్నించారు. హాస్ట‌ళ్లు, ల్యాబులు, బోధ‌నా సిబ్బంది, ప‌రికారాలు, మౌలిక స‌దుపాయాలు లేకుండా వైద్య క‌ళాశాల‌ల్ని ఎలా ప్రారంభించారో ఆశ్చ‌ర్యం క‌లుగుతోంద‌న్నారు. పులివెందుల వైద్య క‌ళాశాల‌లో 47.5 శాతం బోధ‌నా సిబ్బంది లేర‌ని, ఎన్డీయే ప్ర‌భుత్వం వ‌చ్చాక 320 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు, అసోసియేట్ ప్రొఫెస‌ర్లు, ప్రొఫెస‌ర్ల పోస్టుల‌కు నోటిఫికేష‌న్ ఇస్తే పులివెందుల‌కు వెళ్లేందుకు ఒక్క‌రు కూడా ముందుకు రాలేద‌న్నారు.

ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాల‌యంకు చెందిన రూ.400 కోట్ల‌ను గ‌త ప్ర‌భుత్వం దారిమ‌ళ్లించింద‌ని, కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక ముఖ్య‌మంత్రి శ్రీ చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు ఆ నిధుల్ని వెన‌క్కి తీసుకొచ్చింద‌ని మంత్రి వివ‌రించారు. కేంద్ర ప్రాయోజిత నిధుల్ని కూడా దారిమ‌ళ్లించార‌న్నారు. రాష్ట్ర ప్ర‌యోజనాల్ని కాపాడ‌డంలో ఏమాత్రం ప్ర‌య‌త్నం లోప‌ముండ‌ద‌నీ, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే ప్ర‌భుత్వం ఉన్నందున ఆ దిశ‌గా కృషి చేస్తామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. పులివెందుల వైద్య క‌ళాశాల‌కు రూ. 500 కోట్ల‌కు గాను రూ.293 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేశార‌ని, మిగ‌తా రూ. 207 కోట్లు రెండు నెలల్లో ఖ‌ర్చు చేయ‌డం సాధ్య‌మా …కాంట్రాక్ట‌ర్లు ముందుకొస్తారా అని మంత్రి ప్ర‌శ్నించారు. సెకండ్ ఫేజ్‌లోని 5 వైద్య క‌ళాశాల‌ల్లో పులివెందుల‌తో పాటు మ‌ద‌నప‌ల్లె కూడా రూ.474 కోట్ల‌కు గాను రూ. 30 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేశార‌ని, 6 శాతం ప‌నులు జ‌రిగాయ‌న్నారు. ఈవిద్యా సంవ‌త్స‌రంలో మొద‌లు పెట్టాల్సి ఉన్నా మౌలిక స‌దుపాయాలు క‌ల్పించ‌కుండా ఎలా సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. ఐదేళ్ల‌లో కానిది రెండు నెల‌ల్లో పూర్తిచేయడం ఎలా సాధ్య‌మ‌వుతుంద‌న్నారు.

పులివెందుల ప్రభుత్వ వైద్య కలాశాలలో అడ్మిషన్లకు సంబంధించి జాతీయ వైద్య కమిషన్ నుండి లేఖ అందిన వెంటనే 2024-25 కాలంలో మౌలిక సదుపాయాల లోటుపాట్లు, తరగతుల ప్రారంభించటానికి ఫ్యాకల్టీ కొరత వంటి అంశాలపై వాస్తవిక సమాచారాన్ని రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు కమిషన్ కు తెలియచేశారన్నారు. టీచింగ్‌ ఫ్యాకల్టీ కొరతతో పాటు సివిల్ పనుల కొనసాగింపు, పరికరాల సేకరణలో కూడా జాప్యం జరిగిందన్నారు. ఆసక్తి వ్యక్తీకరణ లేఖ(లెట‌రాఫ్ ఇంటెంట్‌) అందిన తరువాత జాతీయ వైద్య కమిషన్ నిబంధన ప్రకారం అనుమతి లేఖను పొందడం కోసం నిర్ణీత ప్రమాణాల మేరకు అన్ని మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ లభ్యతను నిర్ధారిస్తూ సంబంధిత శాఖ కార్యదర్శి ఒక లిఖితపూర్వక వాగ్దానం ఇవ్వాల్సి వుంటుందని మంత్రి వివరించారు. లోటుపాట్ల ద్రుష్ట్యా ప్రభుత్వం అటువంటి వాగ్దానాన్ని ఇవ్వలేదన్నారు. అందుబాటులో వున్న స్వల్ప వ్యవధిలో లోటుపాట్లను సరిచేయటం సాధ్యం కానందున పులివెందుల వైద్య కళాశాలకు సంబంధించిన వాస్తవ పరిస్థితిని వైద్య విద్య సంచాలకులు ఎన్ ఎంసికి తెలియచేశారని చెప్పారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానంపై సభ్యులడిగిన మరో ప్రశ్నకు మంత్రి స‌మాధానం చెప్తూ ప్రతి వైద్య కళాశాలకు దాదాపు రు.600 కోట్ల మూలధన పెట్టుబడి, ఏటా రు.135 కోట్ల నిర్వహణా వ్యయం అవసరమవుతాయన్నారు. స్వయం సమ్రుద్ధి పొంది నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించటానికి వీలుగా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వైద్య విద్య పరిశోధనా సంస్థ(ఎపిమెర్క్)ను ఏర్పాటు చేసిందన్నారు.

సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద వసూలైన మొత్తాన్ని ఈ సంస్థ ఖాతాకు జమ చేసి ఆ మొత్తాన్ని ప్రస్తుతమున్న క‌ళాశాల‌ల‌తో పాటు కొత్త వైద్య కళాశాలల అభివ్రుద్ధికి మాత్రమే ఉపయోగించాల్సి వుంటుందన్నారు. దీంతోపాటు 50 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద కేటాయిస్తారని, ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా వీటిని అభ్యర్ధులకు కేటాయిస్తారని మంత్రి వివరించారు. ఇన్ సర్వీస్ రిజర్వేషన్లపై సభ్యులడిగిన మరో ప్రశ్నకు ఆయన బదులిస్తూ ప్రభుత్వ నిర్వహణలోని సెకండరీ, టెరిషరీ ఆరోగ్య సంస్థలలో ఖాళీలను భర్తీ చేయటానికి స్పెష‌లిస్టుల అవసరాల ఆధారంగా ఇన్ సర్వీస్ రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతోందన్నారు. స్పెష‌లిస్టుల అవ‌స‌రానికి సంబంధించి ప్ర‌భుత్వం నియ‌మించిన క‌మిటీ పూర్తిస్థాయిలో విశ్లేషించి భ‌విష్య‌త్తులో త‌క్కువ ఖాళీల లభ్యత ద్రుష్ట్యా ఇన్ సర్వీస్ కోటాను తగ్గించాలని నిఫుణుల కమిటీ సిఫారసు చేసిందని మంత్రి వివరించారు. ప్రైవేటు వైద్య కళాశాలలో కూడా 50 శాతం కన్వీనర్ కోటా సీట్లలో ఇన్ సర్వీస్ రిజర్వేషన్లు అందుబాటులో ఉందన్నారు. దేశంలో వైద్య విద్య డిమాండ్, అవసరం, సీట్ల లభ్యత ఆధారంగా కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ సభ్యులకు వివరించారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com