మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనలో ఎల్అండ్ టీకి సీసీ సర్టిఫికెట్ ఇచ్చిన అంశంపై సర్కార్ క్రమశిక్షణ చర్యలకు దిగింది. అప్పటి ఎస్‌ఈ, ఈఈలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. త్వరలోనే కేసీఆర్, హరీష్ లకు మెమోలు జారీ చేసే అవకాశం ఉంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పనులు పూర్తికాకముందే పూర్తి అయినట్లుగా నిర్మాణ సంస్థ అయిన ఎల్అండ్ టీకి కంప్లీషన్ సర్టిఫికెట్ (సీసీ) ఇచ్చిన అంశంపై రేవంత్ సర్కార్ క్రమశిక్షణ చర్యలకు దిగింది. సర్టిఫికెట్ లను జారీచేసిన అప్పటి ఎస్‌ఈ, ఈఈలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఆ సమయంలో ఎస్ఈగా బి.వి. రమణా రెడ్డి, ఈఈగా తిరుపతిరావు పనిచేశారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇరిగేషన్ శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా వీరికి చార్జ్మెమోలు జారీ చేశారు.
వివరణ ఇవ్వకుంటే చర్యలు
విధినిర్వహణలో నిర్లక్యంగా వ్యవహరించడం, నిర్మాణ సంస్థకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారన్న కారణాలతోఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులపై 10 రోజుల్లో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని అంతేకాకుండా వ్యక్తిగతంగా వచ్చి విచారణ అధికారులకు వివరణ డాక్యుమెంట్లను సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకవేళ గడువు సమయంలోపు వివరణ ఇవ్వకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే నిబంధనలకు లోబడే ఆ సర్టిఫికెట్‌లు ఇచ్చామని సదరు ఎస్‌ఈ, ఈఈలు వెల్లడిస్తున్నారు. ఒకవేళ అభియోగాలు నిరూపితమైతే మాత్రం అధికారులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇక మేడిగడ్డ అంశంపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఇంజనీర్లకు మెమోలు జారీ చేయగా తరువాత కేసీఆర్, హరీష్ లకు కూడా మెమోలు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
కాగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని ఎల్‌అండ్‌టీ సంస్థ 2016 నవంబరులో స్టార్డ్ చేసి 2019లో కంప్లీట్ చేసింది. అయితే బ్యారేజీ ప్రారంభించిన తర్వాత తొలి వరదలకే సీసీ బ్లాకులు చెల్లాచెదురు కావడంతో పాటు బ్యారేజీ ఎగువ, దిగువభాగంలోని అఫ్రాన్లు దెబ్బతిన్నాయి. ప్రాజెక్టు పూర్తయినట్లు ఇచ్చిన సర్టిఫికెట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే రద్దు చేసింది.