వేణుస్వామికి హైకోర్టు బిగ్ షాక్
చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్‌కు ఆదేశం
టాలీవుడ్ నటీనటులు నాగ చైతన్య-శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్ మెంట్ తర్వాత వీరి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వేణు స్వామి అలియాస్ వేణు పరాంకుశానికి సోమవారం తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై గతంలో ఇదే వ్యవహారంలో తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు పంపింది. వీటిని హైకోర్టులో సవాల్ చేసిన వేణుస్వామికి కోర్టు మొట్టికాయలు వేసింది. గతంలో నాగ చైతన్య, శోభితల ఎంగేజ్మెంట్ జరిగిన సమయంలో వేణు స్వామి వీరిద్దరి జ్యోతిష్యం చెప్పారు. శుభమా అంటూ ఎంగేజ్మెంట్ జరుగుతుండగా వీరిద్దరూ భవిష్యత్తులో విడాకులు తీసుకుంటారంటూ వేణు స్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
దీంతో ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఆయనపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మహిళా కమిషన్ తమ ముందు హాజరు కావాలని వేణు స్వామిని ఆదేశించింది.
అయితే, మహిళా కమిషన్ కు ఆ అధికారం లేదంటూ హైకోర్టుకు వెళ్లి వేణు స్వామిస్టే తెచ్చుకున్నారు. దీనిపై తదుపరి విచారణ నిర్వహించిన హైకోర్టు.. ఆ స్టే ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతే కాదు వేణుస్వామిపై చర్యలు తీసుకునేందుకు కమిషన్ కు పూర్తి అధికారాలు ఉన్నాయని తీర్పు ఇచ్చింది. అలాగే వారం రోజుల్లోనే వేణుస్వామిపై చర్యలు తీసుకోవచ్చని మహిళా కమిషన్ కు స్పష్టం చేసింది. దీంతో మహిళా కమిషన్ ఏం చేయబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.