Friday, March 28, 2025

మీరు ఎంత తీసుకున్నారు..?

బెట్టింగ్ యాప్స్ కేసులో యాంకర్ శ్యామల విచారణ

బెట్టింగ్ యాప్స్‌ వ్యవహారంలో సోమవారం యాంకర్ శ్యామల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురు పోలీసుల విచారణను ఎదుర్కున్నారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో యాంకర్ శ్యామల తన న్యాయవాదితో కలిసి విచారణకు వచ్చారు. ఈ కేసులో శ్యామలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విచారణకు వచ్చిన యాంకర్ నుంచి పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. సోమవారం ఉదయం 8:44 గంటల ప్రాంతంలో యాంకర్ పంజాగుట్ట పీఎస్‌కు వచ్చారు. సుమారు గంటన్నర పాటుగా ఆమెను పోలీసులు విచారించారు. ఇప్పటికే నిమిషానికి రూ. 90 వేలు తీసుకున్నట్లు యాంకర్‌ విష్ణుప్రియ పోలీసుల ముందు చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు శ్యామలను కూడా ఎంత తీసుకున్నారు.. ఎలా తీసుకున్నారు అనే విషయాలపై విచారణ చేస్తున్నారు.
ఒక సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాంకర్ శ్యామలపై పంజాగుట్ట పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత విచారణకు రావాల్సిందిగా గతంలో పోలీసులు ఒకసారి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు ఆమె స్పందించలేదు. విచారణకు హాజరుకాకుండా నేరుగా శ్యామల హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే క్వాష్ పిటిషన్‌ను కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చారు. శ్యామలను అరెస్టు చేయవద్దని, నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. అలాగే ఈరోజు పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఉదయమే శ్యామల విచారణకు వచ్చారు. ఆంధ్రా 365 అనే బెట్టింగ్ యాప్‌ను గత కొంతకాలంగా శ్యామల ప్రమోట్ చేశారు. న్యాయవాదితో కలిసి యాంకర్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు.
కాగా.. బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించి పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో 11 మందిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురిని పోలీసులు విచారించారు. తేజ, కానిస్టేబుల్ కిరణ్, విష్ణుప్రియ, రీతూ చౌదరిని పోలీసులు విచారించి వారి వద్ద నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా యాంకర్ శ్యామలను పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో పరారీలో ఉన్న వారికి మరోసారి నోటీసులు ఇచ్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ వ్యవహారంలో యూట్యూబర్ భయా సన్నీ యాదవ్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అతడు విదేశాల్లో ఉండటంతో లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ కోసం సన్నీ యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. సన్నీ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరుగనుంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com