Wednesday, September 18, 2024

ప్రజాభవన్ లో ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ

పెండింగ్ లో ఉన్న రాష్ట్ర విభజన అంశాలపై చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి సర్వం సిద్ధమైంది. ఆయా రాష్ట్రాల్లో

కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి విభజనకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై తొలిసారిగా భేటీ కావడంతో ఇరు రాష్ట్రాలతో పాటు దేశ రాజకీయాల్లో ఆసక్తి నెలకొన్నది. దీంతో నేడు సాయంత్రం హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో జరగనున్న ఈ భేటీ ఎలాంటి ఫలితాలిస్తుందోననే ఉత్కంఠ నెలకొన్నది. అయితే భేటీలో చర్చకు వచ్చే అంశాలపై ఇద్దరు సీఎంలతో పాటు ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇందులో ఏపీ ఆధీనంలో ఉన్న హైదరాబాద్ లోని ఆస్తుల స్వాధీనం, అప్పుల వాటా వివరాలపై తెలంగాణ సర్కార్ నివేదిక సిద్ధం చేయగా, ఇటు ఏపీ సైతం తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన బకాయిలు ఏమున్నాయనే కోణంలో సమాచారాన్ని సేకరించింది. తాజాగా రెండ్రొజుల పాటు ఢిల్లీలో మకాం వేసి..ప్రధానమంత్రి సహా ఇతర మంత్రులను కలిసి తమ తమ రాష్ట్రాలకు రావాల్సిన నిధులు రాబట్టే ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గత పదేళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న విభజన అంశాలనూ వారి దృష్టికి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీ పర్యటన ముగించుకున్నసీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకోగా, ఇటు ఏపీ సీఎం చంద్రబాబు సైతం శుక్రవారం రాత్రి ఢిల్లీ నుంచి వచ్చేశారు. చంద్రబాబు రాకకోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయగా, నగరంలో ఉన్న టీడీపీ అభిమానులు, పార్టీ నేతలు బాబుకు ఆహ్వానం పలుకుతూ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రజాభవన్ వరకు భారీ ఫ్లెక్సీలు, టీడీపీ జెండాలు ఏర్పాటు చేశారు. దీంతో ఆయా ప్రాంతాలన్నీ పసుపుమయమయ్యాయి.

ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చ జరగనుంది. ప్రధానంగా విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశముంది. తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ ప్రభుత్వం దాదాపు రూ.24 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రమే తమకు రూ.7 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుబడుతోంది.కాగా మార్చి నెలలో సీఎం చొరవతో దిల్లీలో ఏపీ భవన్కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. మైనింగ్ కార్పొరేషన్ కు సంబంధించిన నిధుల పంపిణీకి పడిన చిక్కుముడి ఇటీవల వీడిపోయింది.

ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. షెడ్యూల్ 9లో ఉన్న మొత్తం 91 సంస్థల ఆస్తులు,అప్పులు,నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోం శాఖ షీలాబీడే కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేమీ లేవు. కానీ మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదు. ఇక పదో షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేడ్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. దీంతో పాటు ఉన్నత విద్యా మండలి, పట్టాణభివృద్ధి శాఖ పరిధిలోని ఏపీ హౌసింగ్ బోర్డు నుంచి కొన్ని రూ. వేల కోట్ల మేర పెండింగ్ బకాయిలు తెలంగాణ ప్రభుత్వం ఏపీకి చెల్లించాల్సి ఉంది.

ఈ అంశాలపై ఏపీ ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న క్రమంలో తెలంగాణ నుంచి రావాల్సిన నిధుల్లో కొంత మొత్తం వచ్చినా.. కొంత మేరకైనా ఆర్థిక ఊరట ఉంటుందని ఏపీ భావిస్తున్నది. దీంతో పాటు.. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలు.. నదీ జలాల వాటాల గొడవలు, డిస్కంలు,ఇరిగేషన్ ప్రాజెక్టుల గొడవల ప్రస్తావన తెచ్చేందుకు ఏపీ సిద్ధమైంది. ఇదీలావుంటే.. ఇరు రాష్ట్రాలకు చెందిన కొంత మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో స్ధానికత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీకి అలాట్ చేసిన అధికారులు తెలంగాణలో పని చేస్తున్నారు. దీంతో ఆ అధికారుల విషయంలో ఏం చేయాలనే దానిపై స్పష్టతకు రావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నది. మరోవైపు.. ఏపీలో విధులు నిర్వర్తిస్తున్న తెలంగాణ ఉద్యోగులు సైతం తమను అక్కడి నుంచి రిలీవ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో 712 మంది స్థానికత ఉన్న ఉద్యోగులు పని చేస్తున్నారు.

సచివాలయం, హెచ్వోడీలు, 9, 10వ షెడ్యూల్ సంస్థల్లో పని చేస్తున్న 224 మంది రాష్ట్ర కేడర్ ఉద్యోగులూ తమను రిలీవ్ చేయాలని ఏపీలో విధులు నిర్వర్తిస్తున్న తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు. సీనియార్టీ కొల్పోయినా ఫర్వాలేదని.. తమను తమ రాష్ట్రానికి పంపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే విభజన జరిగి పదేళ్లయినా స్థానికత ఆధారంగా తమను స్వరాష్ట్రానికి పంపకపోవడంపై తెలంగాణ ఉద్యోగుల ఆవేదన చెందుతున్నారు. అయితే ఈ అంశం సీఎంల భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఇద్దరు సీఎంల భేటీలో ఏ మేరకు ఏకాభిప్రాయం వస్తుంది..? ఎన్ని అంశాలు కొలిక్కివస్తాయో వేచి చూడాలి.

రేవంత్ జాగ్రత్త.. : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

నేడు హైదరాబాద్ వేదిక జరగనున్న ఏపీ, తెలంగాణ సీఎంల భేటీలో రాష్ట్ర విభజన అంశాల పరిష్కారం ఇరువురికీ కత్తిమీద సాము అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. ఈ భేటీలో ఏ తేడా వచ్చినా రేవంత్‌ రెడ్డిపై తెలంగాణ ద్రోహి ముద్ర వేసేందుకు ప్రత్యర్థులు సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ భేటీకి సంబంధించి చర్చకు వచ్చే అంశాలపై రెచ్చగొడితే రెండు రాష్ట్రాల సమస్యలకు పరిష్కారం లభించదని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో కూర్చొని సామరస్యంగా సమస్యలను ఒకటి తరువాత మరొకటి పరిష్కరించుకోవాలని సూచించారు.

అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలు మరింత జఠిలం కాక ముందే ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాలని అన్నారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య ఏవిధమైన వైశమ్యాలు లేవని, సెంటిమెంట్ తాత్కాలికమేనని నారాయణ స్పష్టం చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular