ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్
ఇండస్ట్రీపై పెరుగుతున్న అనుమానాలు
రాష్ట్ర ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీ మధ్య వివాదం సాగుతుందనే విమర్శల నేపథ్యంలో మెగా ఫ్యామిలీ చేస్తున్న ఓ అంశం మరింత రచ్చగా మారుతున్నది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ – శంకర్ – దిల్ రాజు కాంబినేషన్‌లో ఈ సినిమా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఏపీలో ప్రీ రిలీజ్ వేడుక
రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ ఏపీకి తరలిపోతుందనే ప్రచారం జరుగుతున్నది. అక్కడి మంత్రులు కూడా ఇండస్ట్రీని ఆహ్వానిస్తున్నాం అంటూ ప్రకటన చేశారు. ఇదే సమయంలో ఇటీవల సినీ ప్రమఖులు సీఎంతో భేటీ అయ్యారు. ఈ భేటీలో బెనిఫిట్ షో, టికెట్ ధరల పెంపుపై సీఎం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. ఈ భేటికి మెగా ఫ్యామిలీ నుంచి అంతా దూరంగా ఉన్నారు. చిరంజీవికి ఆహ్వానం ఉందా.. లేదా అనేది ఇప్పటికీ సందిగ్థమే. అయితే గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. ప్రీ రిలీజ్ వేడుకను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను తీసుకురానున్నారు. అయితే ఇదే విషయంపై నిర్మాత దిల్ రాజు సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మంగళగిరి జనసేన కార్యాలయంలో భేటీ అయ్యాడు. దిల్ రాజు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా పవన్ రావాలని దిల్ రాజు కోరడంతో జనసేనాని ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 04న రాజమండ్రిలో నిర్వహించబోతున్నట్లు సమాచారం.