పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేస్తూ భారత్ ఇటీవల కఠిన నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా తొలిసారి స్పందించారు. ఈ ఒప్పందంపై వరల్డ్ బ్యాంక్ జోక్యం చేసుకుంటుందంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టివేశారు. వరల్డ్ బ్యాంక్ పాత్ర కేవలం ఒక సహాయకుడిగానే ఉంటుందని తెలిపారు. ”ఇందులో ఒక సహాయకుడి పాత్రకు మించి వరల్డ్ బ్యాంకు పాత్ర ఏమీ ఉండదు. వరల్డ్ బ్యాంకు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తుందనే ఊహాగానాలన్నీ అర్థం లేనివే. మా పాత్ర కేవలం సహాయకుడి పాత్రకే పరిమితం” అని అజయ్ బంగా చెప్పారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని న్యూఢిల్లీలో గురువారంనాడు కలుసుకున్నారు. దీంతో సింధు జలాల ఒప్పందం రద్దు అంశంపై ప్రపంచ బ్యాంకు మధ్యవర్తితం చేసే అవకాశాలపై ఊహాగానాలు వెలువడ్డాయి.
పహల్గాంలో 26 మంది టూరిస్టులను ఉగ్రవాదులు ఊచకోత కోసిన మరుసటి రోజే సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు భారత్ ప్రకటించింది. దీనిపై పాక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ”నీళ్లివ్వకుంటే రక్తపాతం జరుగుతుంది” అంటూ తీవ్ర ప్రకటనలకు పాక్ నేతలు దిగారు. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో 1960 సెప్టెంబర్‌లో సింధు నది, దాని ఉపనదుల జలాల పంపకంపై భారత్-పాక్ మధ్య ఒప్పందం జరిగింది. అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, పాక్ ప్రధాని అయూబ్‌ఖాన్ దానిపై సంతకాలు చేశారు. కాగా, సింధు జలాల పంపిణీ ఒప్పందం నిబంధనలపై పునః సమీక్ష జరపాలని భారత్ చాలాకాలంగా డిమాండ్ చేస్తోంది. తాగు, సాగునీటి అవసరాల్లో అప్పటికీ ఇప్పటికీ తేడాలొచ్చాయని భారత్ స్పష్ట చేసింది.అయితే పాక్ దీనిని వ్యతిరేకిస్తూ వచ్చింది. ఈ క్రమంలో పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఈ ఒప్పందం అమలును నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.