కనీస టికెట్ ధర రూ. 20 , గరిష్ట ధర రూ. 80
హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంచేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య తగ్గింది. దీంతో మెట్రో నిర్వహణ ఎల్ అండ్ టీ సంస్థకు భారమైంది. రోజువారీ నిర్వహణ ఖర్చులు, నష్టాల భారాన్ని తగ్గించుకునేందుకు ఉన్నతాధికారుల సూచన మేరకు టికెట్ ధరలను పెంచేందుకు ఎల్ అండ్ టీ సంస్థ సమాయత్తమైనట్లు సమాచారం. మెట్రో సర్వీసులు అందుబాటులోకి వచ్చినప్పుడు ఖరారైన ఛార్జీలే నేటికీ అమలవుతున్నాయి. ఒక్కసారి మెట్రో చార్జీలు పెంచితే మరో ఐదేళ్ళ వరకు పెంచే అవకాశం లేదు. అందుకే ఇన్ని అంశాలను బేరీజు వేసుకుని ఛార్జీలు ఎంత పెంచాలనే అంశంపై కసరత్తు చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం మెట్రో ద్వారా రోజుకు 5 లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో గతంతో పోలిస్తే మెట్రో రద్దీ కాస్త తగ్గింది. ప్రతి నెలా రూ.45 కోట్ల చొప్పున ఏడాదికి రూ.640 కోట్ల సష్టం వస్తుందని ఎల్ అండ్ టీ తాజాగా వెల్లడించింది. ఈ క్రమంలో ధరలు నిర్వహణ భారాన్ని తగ్గించుకునేందుకు మెట్రో ప్రయత్నిస్తోంది.
ప్రస్తుతం మెట్రోలో 2 కిలోమీటర్ల దూరానికి టికెట్ ధర రూ.10, 2 నుంచి 4 కిలోమీటర్ల దూరానికి రూ. 15 చొప్పున వసూలు చేస్తున్నారు. అలాగే 4 నుంచి 6 మీ దూరానికి రూ.25 చొప్పున వసూలు చేస్తున్నారు. అలాగే 26 కిలోమీటర్ల దూరానికి గరిష్టంగా రూ. 60 వసూలు చేస్తున్నారు. అయితే మెట్రో టికెట్ ధరలు 5 నుంచి 10 శాతం పెంచనున్న తరుణంలో కనీస టికెట్ ధర రూ. 20 , గరిష్ట టికెట్ ధర రూ. 80ల చొప్పున పెరిగే అవకాశం ఉంది.