Friday, December 27, 2024

మెట్రో రైలు రెండో దశ సవాళ్ళతో కూడుకుంది

ప్రభుత్వాలే చేపట్టాలని సిఎంకు సూచించా
మెట్రో ఎండి ఎన్‌విఎస్ రెడ్డి
మెట్రో రైలు రెండో దశ నిర్మాణం చాలా సవాళ్లతో కూడుకున్నదని హైదరాబాద్ మెట్రో ఎండి ఎన్‌విఎస్ రెడ్డి అన్నారు. సోమవారం ఎజి కార్యాలయంలో ఆడిట్ వారోత్సవాలను ఎన్‌విఎస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్రో రెండో దశ పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మెట్రో రైలు రెండో దశ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే నిర్మించాలని, ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహణ ఉండాలని ఆయన సూచించారు. పై అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించామన్నారు. రెండో దశలో దాదాపు 76 కిలో మీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఇది చాలా సవాళ్లతో కూడుకున్నదని, మెట్రో రెండో దశ నిర్మాణం చేపట్టేందుకు ప్రైవేటు సంస్థలేవి ముందుకు రావడం లేదని చెప్పారు. మెట్రో రైలు మొదటి దశ నిర్మాణంలో ఎల్ అండ్ టీ సంస్థకు భారీ నష్టం వాటిల్లిందని, ఈ అనుభవంతో ప్రైవేటు సంస్థలు ముందుకు రావడానికి భయపడుతున్నాయని ఆయనన్నారు.

మొదటి దశ మెట్రో వల్ల ఎల్ అండ్ టీకి రూ.6 వేల కోట్ల నష్టం వచ్చిందని, ఏడాదికి రూ.1300 కోట్ల నష్టాన్ని ఎల్ అండ్ టీ సంస్థ భరిస్తోందని తెలిపారు. మిగతా రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలే మెట్రోను నిర్వహిస్తున్నాయని, మెట్రో నిర్మాణానికి అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ఆసక్తి చూపడం లేదని ఆయన వివరించారు. మెట్రోను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించాలని సీఎంకు సూచించినట్లు చెప్పారు. రెండో దశ మెట్రో నిర్మాణానికి రూ.24,269 కోట్లు అవసరం అవుతున్నాయని, ఇందులో 48 శాతం నిధులు జైకా ద్వారా సమకూరుతున్నాయని వెల్లడించారు. మంత్రివర్గ ఆమోదం తర్వాతే కేంద్రానికి సిఫారసులు పంపామని, కేంద్రం నుంచి అనుమతులు రాగానే రెండో దశ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఇక ప్రజల సహకారం ఉంటే రెండో దశను శరవేగంగా పూర్తి చేస్తామని ఎన్‌విఎస్ రెడ్డి చెప్పారు.

భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆడిట్, అకౌంట్స్ శాఖ పాత్ర చాలా కీలకమని ఎన్‌విఎస్ రెడ్డి అన్నారు. ప్రజాధనం పూర్తి సద్వినియోగం అవ్వడంతో పాటు వివిధ ప్రాజెక్టులకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్న వ్యయాన్ని తగు విధంగా పరిశీలించే లక్ష్యంతో పని చేస్తున్న సిఎజి ఈ వారోత్సవాల ద్వారా ప్రజలకు అవగాహన కలిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్న దశలో అనేక సవాళ్లు ఎదురవుతాయని వాటిని సమర్థంగా ఎదుర్కొనే యంత్రాంగాన్ని అన్ని విభాగాల్లో సన్నద్ధం చేయాలని ఆయన కోరారు. ఆడిట్ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో రీజినల్ కెపాసిటీ బిల్డింగ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ సి.శైలజ, తెలంగాణ ప్రిన్సిపాల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిట్, డైరెక్టర్ జనరల్ అఫ్ ఆడిట్ (సెంట్రల్) హేమ మునివెంకటప్ప, అకౌంటెంట్ జనరల్ ఆడిట్ పి. మాధవి, ప్రిన్సిపాల్ డైరెక్టర్ అఫ్ కమర్షియల్ ఆడిట్ విఎంవి నావల్ కిషోర్ పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com