హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్త. ప్రయాణికుల సౌకర్యార్థం అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందించాలని నిర్ణయించింది. నిన్నటి నుంచి కొత్త వేళలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం నష్టాల్లో నడుస్తున్న మెట్రో దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం ప్రతి రోజు సగటున 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఈ సంఖ్యను 7 లక్షలకు చేర్చాలనేది మెట్రో లక్ష్యం. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ప్రయాణికులు కూడా మెట్రో సేవలను పొడిగించాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. వారి డిమాండ్ ఇన్నాళ్లకు నెరవేరింది.రైళ్ల రాకపోకలకు, ట్రాక్ నిర్వహణకు సమయం చాలదన్న ఉద్దేశంతో ఇన్నాళ్లు రైళ్ల వేళల పెంపు విషయంలో మెట్రో తాత్సారం చేసింది. తాజాగా నిన్నటి నుంచి వేళలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.