విజయవాడకు మెట్రోరైలు కల సాకారం కానుంది. మెట్రో కారిడార్ నిర్మాణానికి ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలో 91 ఎకరాల భూమి అవసరమని గుర్తించిన ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏపీఎంఆర్‌సీ) తాజాగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశను కలిసి ప్రతిపాదనలు అందజేసింది. తొలుత నాలుగు కారిడార్లుగా విజయవాడ మెట్రో రైల్ నిర్మాణం చేపట్టాలని భావించారు. అయితే, ప్రస్తుతం గన్నవరం, పెనమలూరు నుంచి రెండు కారిడార్లు నిర్మించడంపైనే దృష్టి పెట్టారు. విజయవాడలోని పీఎన్‌బీఎస్ వద్ద ఈ రెండు కారిడార్లు కలిసేలా గతంలో రూపొందించిన ప్రతిపాదనల ప్రకారమే భూసేకరణ చేయనున్నారు.
తొలి కారిడార్ పొడవు 26 కిలోమీటర్లు. ఇది పీఎన్‌బీఎస్ నుంచి ప్రారంభమై విజయవాడ రైల్వే స్టేషన్‌ను కలుపుతూ ఏలూరు రోడ్డు మీదుగా రామవరప్పాడు వద్ద జాతీయ రహదారిపైకి వచ్చి, అక్కడి నుంచి గన్నవరం వెళ్తుంది. ఈ క్రమంలో యోగాశ్రమం, విమానాశ్రయం, గూడవల్లి, చైతన్య కళాశాల, నిడమానూరు, ఎంబీటీ సెంటర్, ప్రసాదంపాడు, రామవరప్పాడు చౌరస్తాల మీదుగా ప్రయాణిస్తుంది. ఆ తర్వాత ఏలూరు రోడ్డులోకి వంపు తిరిగి గుణదల, పడవల రేవు, మాచవరం డౌన్, సీతారాంపురం సిగ్నల్, బీసెంట్‌రోడ్డు రైల్వే స్టేషన్ మీదుగా పీన్‌బీఎస్‌కు రైలు చేరుకుంటుంది.
12.5 కిలోమీటర్లు మేర ఉండే రెండో కారిడార్ పీఎన్‌బీఎస్ నుంచి ప్రారంభమై బందరు రోడ్డు మీదుగా బెంజిసర్కిల్, ఆటోనగర్, కానూరు, పోరంకి మీదుగా పెనమలూరు వరకు వెళ్తుంది. ఈ క్రమంలో పీఎన్‌బీఎస్, బందరు రోడ్డులో విక్టోరియా మ్యూజియం, ఇందిరాగాంధీ స్టేడియం, బెంజి సర్కిల్, ఆటోనగర్, అశోకనగర్, కృష్ణానగర్, కానూరు సెంటర్ తాడిగడప, పోరంకి మీదుగా పెనమలూరుకు చేరుకుంటుంది. మొత్తానికి మెట్రోరైలు వచ్చాక విజయవాడ మరింత పెద్ద నగరంగా మారిపోతుంది.