ఆ ఐదుగురు ఎవరు..?
కేసీఆర్‌కు టచ్‌లోకి ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
బీఆర్ ఎస్ సోషల్ మీడియాలో వైరల్
గులాబీ కండువా వేసుకుంటారనే టాక్
ఇప్పటికే కాంగ్రెస్‌లోకి పది మంది ఎమ్మెల్యేలు
మళ్లీ మొదలైన ఫిరాయింపుల రాజకీయం
కాంగ్రెస్ నుంచి బీఆర్ ఎస్‌లోకి ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్దమయ్యారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు టచ్ లో ఉన్నారని నేషనల్ మీడియాలో వార్త వచ్చిందన్నదని బీఆర్ ఎస్ ప్రచారం చేస్తున్నది. అయితే.. అది ఫేక్ అని, తమతోనే 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ చెప్తున్నది. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని, తమను బీఆర్లో ఎస్‌లోకి రానివ్వాలంటూ కేసీఆర్‌ను ఐదుగురు ఎమ్మెల్యేలు కోరానని ఉదయం నుంచి ప్రచారం జరుగుతున్నది. ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేల విజ్ఞప్తిని కేసీఆర్ తిరస్కరించినట్లు ఆ వార్తలో పేర్కొన్నారు. అయితే.. ఈ ప్రచారాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఖండించారు. ఈ అంశంపై కోమటిరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు 20 మంది వస్తామంటే తామే వద్దంటున్నామన్నారు. బీఆర్ఎస్ పని ఇక అయిపోయిందన్నారు. కేసీఆర్ పేరు ఇప్పుడు తెలంగాణలో ఎక్కడా వినపడటం లేదన్నారు. అసలు కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఉన్నాడా, లేడా? అన్న అనుమానాన్ని సైతం కోమటిరెడ్డి వ్యక్తం చేశారు.
మళ్లీ మొదలు
రాష్ట్రంలో రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మూసి చుట్టూ రాష్ట్ర రాజకీయాలు కొనసాగుతున్న నేపథ్యంలో… ఈమధ్య కేటీఆర్ బామ్మర్ది పార్టీ వ్యవహారం తెరపైకి వచ్చింది. దీంతో రాజకీయాలు ఒక్కసారిగా కేటీఆర్ బామ్మర్ది పార్టీ పైకి మల్లాయి. కాంగ్రెస్ వర్సెస్ గులాబీ పార్టీ నేతల మధ్య డ్రగ్స్ పరీక్షల పంచాయతీ కొనసాగుతోంది. డ్రగ్స్ టెస్ట్ కు నేను రెడీ అంటే నేను రెడీ అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ నేతలు అన్నట్లుగా వ్యవహారం నడుస్తోంది.
అయితే, ఈ డ్రగ్స్ టెస్టుల వ్యవహారం కొనసాగుతున్న తరుణంలో గులాబీ పార్టీలోకి ఎమ్మెల్యేలు అంటూ సంచలన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఓ నేషనల్ పత్రికలో కేసీఆర్ పార్టీ గురించి ప్రత్యేక కథనం కూడా వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఐదుగురు… కెసిఆర్ టచ్ లోకి వెళ్లారని బీఆర్ ఎస్ ప్రచారం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో ఉండబోమని, గులాబీ పార్టీలో చేరతామని, కేసీఆర్ దగ్గరికి ఐదుగురు ఎమ్మెల్యేలు వచ్చారని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని, మళ్లీ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచే ప్రసక్తే లేదని సర్వేలు కూడా చెబుతున్నాయని, ఆ ఎమ్మెల్యేలు గ్రహించినట్లు తెలుస్తున్నది. దీంతో చేసేది ఏమీ లేక కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లి గులాబీ కండువా వేసుకుంటామని చెప్పినట్లు టాక్.
వద్దు పొండి
అయితే, ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్ ను కలిసిన తర్వాత గులాబీ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారని బీఆర్ ఎస్ సోషల్ మీడియాలో ప్రచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరవద్దని తేల్చి చెప్పారని, ప్రజల కోసం పోరాటం చేస్తామని, ఎన్నికలలో తమ పార్టీ నుంచి గెలిచిన వారు మాత్రమే తమ నేతలని స్పష్టం చేశారని చెబుతున్నారు.
ఐదుగురు ఎవరు..?
కేసీఆర్‌ను కలిసిన ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు ఎవరు అనే దానిపైన కొత్త చర్చ మొదలైంది. నిజానికి, ఇప్పుడు బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. కానీ, ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బీఆర్ ఎస్ న్యాయ పోరాటం చేస్తుంది. కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ పరిణామాల్లో కాంగ్రెస్‌లోకి వలసలు ఆగిపోయాయి. అయితే, కాంగ్రెస్ నుంచి బీఆర్ ఎస్‌లోకి ఎమ్మెల్యేలు వెళ్తున్నారనే ప్రచారాన్ని బీఆర్ ఎస్ అనూహ్యంగా తెరపైకి తీసుకువచ్చింది. ఇదంతా ఒక మైండ్ గేమ్ అని కూడా కొట్టిపారేస్తున్నారు.