అది మంత్రి కాన్వాయి.. ముందు సీటులో ఓ మంత్రి.. అప్పుడే కార్యక్రమం పూర్తి కావడం, వెంటనే కారులోకి వెళ్లడం.. ఏదో అర్జంట్ అంటూ సెల్‌ఫోన్‌లో బిజీ అయ్యాడు సదరు మంత్రి. ఇక అదే కారులో వెనక సీటులో ఓ ఎంపీ.. మరో ఎమ్మెల్యే.. తన వర్గానికి చెందినవారితో నిత్యం గొడవ పెట్టుకుంటున్నావంటూ ఎంపీ వివాదం మొదలుపెట్టాడు. తన సెగ్మెంట్‌లో ప్రతి విషయంలో ఇన్‌వాల్వ్ అవుతున్నారని, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ అయితే.. అధికారిక కార్యక్రమాలకు ఎందుకు వస్తున్నారంటూ సదరు ఎమ్మెల్యే రిప్లై ఇచ్చాడు. దీంతో మాటామాటా పెరిగింది. వెనక సీటులో పక్క పక్కన ఉన్న వారిద్దరు ఒకరిపై ఒకరు చేయి చేసుకునే పరిస్థితి వచ్చింది. తనకే సమాధానం ఇస్తావా అంటూ ఆగ్రహంతో ఉన్న ఎంపీ.. ఎమ్మెల్యే చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చారు. దీంతో బిత్తరపోయిన సదరు ఎమ్మెల్యే.. వెంటనే తేరుకుని సమాధానంగా ఎంపీపై చేయ్యెత్తాడు. ఇదంతా జరుగుతున్నా సదరు మంత్రి మాత్రం మౌనంగానే ఉన్నాడు. ఆ తర్వాత ఒకరి చేయి.. మరొకరు.. ఒకరి గల్లా మరొకరు పట్టుకుని గొడవకు దిగడంతో మంత్రి తేరుకుని.. నిదానంగా వారిని వారించారు. ఈ విషయం ఎలాగో ఇంటలీజెన్సీ ద్వారా సీఎంకు చేరింది.
మంత్రి గారి కారులో కుమ్ములాట
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతల కుమ్ములాటకు దిగారు. తాజాగా భూభారతి అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తుండగా.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గద్వాల సెగ్మెంట్‌కు వెళ్లారు. అక్కడ నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి.. అదే సెగ్మెంట్‌లో కృష్ణమోహన్‌రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయిన గద్వాల జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ సరితా తిరుపతయ్య మధ్య గొడవ జరిగింది. మంత్రి ముందే వేదికపై వాగ్వాదానికి దిగారు. ఎలాగో సభ అనంతరం మంత్రి పొంగులేటి కారులో గన్ మెన్లను దించేసి ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి బయలుదేరారు. అయితే, గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పాత లీడర్లను పట్టించుకోవడం లేదని ఎంపీ మల్లు రవి కారులో వివాదం మొదలుపెట్టారు. దీనికి సమాధానంగా ఎన్నికల్లో ఓడిపోయిన సరితా తిరుపతయ్య ను ఎలా ఎంకరేజ్ చేస్తారంటూ కృష్ణమోహన్‌రెడ్డి బదులిచ్చారు. కనీసం వేదికపైకి రాకుండా అడ్డుకుంటున్నారని ఎంపీ మల్లు రవి వాదించారు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. కోపంతో ఊగిపోయిన ఎంపీ మల్లు రవి.. ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చెంప మీద కొట్టారు. తానేం తక్కువ తినలేదనే రీతిలో ఎంపీ మీద ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కూడా చేయి చేసుకున్నారు. ఈ ఊహంచని పరిణామంతో షాక్ అయిన మంత్రి పొంగులేటి.. ఇద్దరి వివాదం చూస్తూనే ఉన్నారు. కారులో ముందు సీటులో కూర్చుని కొంతసేపు మౌనంగా ఉండిపోయిన మంత్రి.. ఆ తర్వాత తేరుకుని ఇద్దరినీ వారించారు.
ఈ విషయాన్ని ఎట్టకేలకు ఇంటలీజెన్సీ వర్గాలు సీఎంకు చేరవేశాయి. దీంతో మంత్రి పొంగులేటీతో సీఎం రేవంత్ రెడ్డి ఇదే విషయంలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తున్నది. కాగా, ఇప్పటికే పలుసార్లు గద్వాల సెగ్మెంట్‌లో ఎమ్మెల్యే బండ్ల, జెడ్పీ మాజీ చైర్మన్ సరితా తిరుపతయ్య మధ్య వివాదం జరిగింది. ప్రోటోకాల్ రగడ పెరుగడంతో.. మంత్రి జూపల్లి మధ్యవర్తిత్వంతో పలుమార్లు ఇరువురికి సర్ది చెప్పారు. అయితే, ఇటీవల వరుసగా గొడవలు జరుగుతుండటంతో.. తాను కాంగ్రెస్ కాదని.. బీఆర్‌ఎస్‌లో ఉన్నానంటూ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి తాజాగా ప్రకటించారు. ఈ వివాదం కారణంగానే ఆయన ఈ ప్రకటన చేసినట్లు అర్థమవుతున్నది.