Thursday, December 26, 2024

పదోన్నతులు వెంటనే కావాలి….పనులు మాత్రం చేయరు…

హక్కుల గురించి అడిగేటప్పుడు బాధ్యతలు కూడా నిర్వర్తించాలి
రోడ్ల మరమ్మతుల్లో ఎందుకంత నిర్లక్షం…?
ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎస్టీమేషన్లు, టెండర్లని కాలం వెల్లదీస్తారా..!
అధికారుల పనితీరుపై ఇకపై ప్రతివారం సమీక్ష చేయాలి
ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించి రోడ్లకు సంబంధించిన
నివేదిక సిద్ధం చేయాలి: ఉన్నతాధికారులకు మంత్రి సూచన
టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణంలో జాప్యం సహించేది లేదు
వచ్చే జూలై, 2025 నాటికి ఈ ఆస్పత్రుల నిర్మాణాలను పూర్తి చేయాలి
రోడ్లు, భవనాల శాఖ అధికారుల పనితీరుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం

వర్షాలకు రోడ్లు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మరమ్మతులు చేయకుండా నిర్లక్యం ఎందుకు వహిస్తున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ అండ్ బి అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వరంగల్ జిల్లాలోని మామునూర్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు ఆర్ అండ్ బి రోడ్లకు సంబంధించి సచివాలయంలోని తన చాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ నిద్రమత్తు వీడి దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. అధికారులు మాటలు చెప్పవద్దని రిజల్ట్ మాత్రమే కావాలని అధికారులపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యాడు. ప్రతి సమీక్షలో అధికారులు రోడ్లు బాగున్నాయని చెబుతారు, ప్రజలు రోడ్లు బాగాలేవంటున్నారని, ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించి రోడ్లకు సంబంధించిన నివేదిక సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. రోడ్లకు ప్యాచ్‌వర్క్ చేయడానికి ఇంత ఆలస్యం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎస్టీమేషన్లు, టెండర్లని కాలం వెల్లదీస్తారా అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. డిపార్ట్‌మెంట్‌లో సర్వీస్ రూల్స్ కావాలంటే తీసుకొచ్చామని, ట్రాన్స్‌ఫర్లు చేసుకుంటామంటే అనుమతించానని, అధికారులు ఏదీ అడిగితే అది చేస్తున్నా, వారి పనితీరు మెరుగుపడడం లేదని మంత్రి కోమటిరెడ్డి మండిపడ్డారు. అధికారుల పనితీరుపై ఇకపై ప్రతివారం సమీక్ష చేయాలని రోడ్లు, భవనాల శాఖ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్, స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందనలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు.

పనులు జరగడం లేదు… సీఈ మోహన్ నాయక్‌పై మంత్రి సీరియన్
మన పక్కరాష్ట్రాల్లో రోడ్ల మరమ్మతులకు జెట్ ప్యాచ్‌వర్క్ మెషీన్లు, వెలాసిటీ ప్యాచింగ్ వంటి అధునాతన పద్ధతులతో పాట్ హోల్స్ పడిన వెంటనే పూడుస్తుంటే తెలంగాణలో మాత్రం పురాతన పద్ధతుల్లో పాట్‌హోల్స్ మరమ్మతులు చేస్తున్నామని ఇది మన ఆర్ అండ్ బి అధికారులకు ఉన్న నైపుణ్యమని మంత్రి సున్నితంగా చురకలు అంటించారు. రూ. 500 కోట్లు ఖర్చు చేస్తే దాదాపు 4-5 వేల కోట్ల విలువ చేసే రోడ్లకు మరమ్మతులు చేయవచ్చని, కానీ, ఎక్కడా పనులు జరగడం లేదని సీఈ మోహన్‌నాయక్‌ను మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. కొత్తగా వచ్చిన ఏఈఈలను ఇప్పటిదాక కనీసం ఫీల్డ్ మీదకు పంపకపోవడం ఏమిటనీ మంత్రి నిలదీశారు. ఇంజనీర్లంతా ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరుగుతూ కొత్త రోడ్లను ప్రపోజల్స్ తయారు చేసే కన్సల్టెంట్లుగా మారారని, అయినా అధికారులు మాత్రం రోడ్ల మరమ్మతుల సమస్య పరిష్కరించలేకపోతున్నారని మంత్రి కోమటిరెడ్డి సీఈపై అసహనం వ్యక్తం చేశారు.

ప్రజలపై భారం కాకుండా పిపిపి మోడల్స్ ప్రణాళికలు సిద్ధం చేయాలి
ప్రజలపై భారం కాకుండా పిపిపి మోడల్స్ ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన పిపిపి మోడల్ రోడ్ల ఐడెంటీఫికేషన్‌పై స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్‌ను అడగ్గా, ఇప్పటివరకు 1,787.06 కిలోమీటర్ల (20 రోడ్లను) గుర్తించామని మంత్రితో పేర్కొన్నారు. ఏ రోడ్డు నిర్మాణ పద్ధతి అవలంభించినా అంతిమంగా ప్రజల మీద భారం పడకుండా ఉండే పిపిపి మోడల్ ను తీసుకురావాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులతో పేర్కొన్నారు. కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అనుసరిస్తున్న రోడ్డు నిర్మాణ పద్ధతులను ఇక్కడ కూడా అనుసరిస్తున్నామని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణంపై సెక్షన్ సీఈ మంత్రి ఆగ్రహం
టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణంలో జాప్యం సహించేది లేదని మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు. టిమ్స్ ఆస్పత్రి నిర్మాణంలో జాప్యం ఎందుకు జరుగుతుందని, ప్రతి సమీక్షలో అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటున్నారు, ప్రారంభించే టైం పెంచడం తప్పా, ఇప్పటిదాక ఏం పురోగతి కనిపించడం లేదని బిల్డింగ్స్ సెక్షన్ సీఈ రాజేశ్వర్ రెడ్డిపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. నాలుగు టిమ్స్ ఆస్పత్రిల నిర్మాణంలో ఇప్పటిదాక ఒక్క పురోగతిని చూపించలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ప్రాథమిక అవసరమైన ఆస్పత్రుల నిర్మాణంలో ఇంత నిర్లక్ష్యం దేనికని మంత్రి ప్రశ్నించారు. ప్రభుత్వం దవాఖానాలు అందుబాటులోకి రాకపోతే పేదలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చు పెట్టి ప్రాణాలు సైతం పొగొట్టుకుంటారని దానికి ఎవరు బాధ్యత వహిస్తారని మంత్రి కోమటిరెడ్డి నిలదీశారు.

ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నా
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో మాట్లాడి బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నానని, అయినా ఎందుకు నిర్మాణాలు ఆలస్యం జరుగుతున్నాయని అధికారులను మంత్రి కోమటిరెడ్డి నిలదీశారు. రోజు వేలాది మంది వచ్చే నిమ్స్ భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుంటే మీరంతా ఏం చేస్తున్నారని అధికారులను మంత్రి పశ్నించారు. ఇప్పటికైనా అధికారులంతా కలిసికట్టుగా పనిచేసి వచ్చే జూలై, 2025 నాటికి టిమ్స్ ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి సూచించారు. నాణ్యతలో ఎక్కడా రాజీపడొద్దని అధికారులకు మంత్రి సూచించారు.

మన ఇంజనీర్ల పనితీరు ఇదీ…?
సచివాలయంలోని తన చాంబర్‌లో తన కుర్చీ కింద టైల్స్‌ను బిగించడంలో అధికారులు చూపిన నిర్లక్ష్యాన్ని మంత్రి స్వయంగా చూపించారు. రాష్ట్ర సచివాలయ నిర్మాణానికి వెయ్యికోట్లకు పైగా ఖర్చుపెట్టామని చెప్పిన మన ఇంజనీర్ల పనితీరు ఇంత నిర్లక్ష్యంగా ఉందని, టైల్స్ మధ్య గ్యాప్స్ ఇలా ఉంటుందా అని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. మనం ఖర్చుపెట్టే ప్రతి పైసా ప్రజల సొమ్మని దానిని మరిచిపోయి ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మంత్రి హెచ్చరించారు.

ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే వదిలే ప్రసక్తి లేదు
గత ప్రభుత్వంలో మాదిరిగా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే వదిలే ప్రసక్తి లేదని మంత్రి కోమటిరెడ్డి తేల్చిచెప్పారు. ప్రతిది నాణ్యంగా ఉండాలి, ప్రతి పని ప్రజలు మెచ్చుకునేలా చేయాలని మంత్రి కోమటిరెడ్డి సూచించారు. ప్రతివారం టిమ్స్ ఆస్పత్రి భవనాల నిర్మాణ స్థితిగతులపై సమీక్షలు నిర్వహించి నివేదిక ఇవ్వాలని రోడ్లు భవనాల శాఖ అధికారులైన వికాస్ రాజ్, దాసరి హరిచందనలను మంత్రి ఆదేశించారు. ఇదే క్రమంలో ఒక్కొక్కరికి రెండు, మూడు అదనపు బాధ్యతలు ఉన్నాయని పదోన్నతులు ఇస్తే కొంత భారం తగ్గుతుందని ఈఎన్సీ మధుసూధన్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకురాగా ఇన్ని బాధ్యతులు అప్పగిస్తే ఎందుకు పాట్ హోల్స్ మరమ్మతులు కాలేదని, ఎందుకు టిమ్స్ ఆస్పత్రి నిర్మాణం పూర్తి కాలేదని మంత్రి ప్రశ్నించారు. హక్కుల గురించి అడిగేటప్పుడు బాధ్యతలు కూడా నిర్వర్తించాలని మంత్రి కోమటిరెడ్డి సున్నితంగా హెచ్చరించారు.

మూడేళ్లలో మామునూర్ ఎయిర్‌పోర్టు నిర్మాణం కావాలి
మూడేళ్లలో మామునూర్ ఎయిర్ పోర్టు నిర్మాణం కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులకు దిశానిర్ధేశం చేశారు. తాత్కాలిక ఏర్పాట్ల కంటే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులకు మంత్రి సూచించారు. త్వరితగతిన భూసేకరణ పూర్తిచేసి మూడేళ్లలో ఎయిర్‌పోర్టును పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రతి పదిహేను రోజులకోసారి పనుల పురోగతిపై సమీక్ష చేస్తానని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలాగా హామీలతో కాలం గడిపితే అర్ధం లేదని, విమానాశ్రయం నిర్మించి వదిలేయకుండా విమానాల రాకపోకలపై దృష్టిపెట్టాలని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఉన్నతాధికారులకు మంత్రి వెంకట్ రెడ్డి సూచించారు.

వరంగల్ ఎయిర్ పోర్టును ఉడాన్ స్కీంతో అనుసంధానం చేసి ఇతర పెద్ద పట్టణాలతో రాకపోకలకు అనుకూలంగా మార్చాలని మంత్రి ఆదేశించారు. యునెస్కో గుర్తింపుపొందిన రామప్ప, భద్రకాళి, వెయ్యి స్తంభాల దేవాలయం ఇతర కాకతీయ కట్టడాలతో పాటు టెక్స్ టైల్ పార్క్ అవసరాలు, భవిష్యత్ పరిశ్రమలకు అనుగుణంగా ఎయిర్ పోర్టును తీర్చిదిద్దాలని అధికారులకు మంత్రి మార్గనిర్ధేశనం చేశారు. త్వరలోనే తాను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి స్వయంగా మామునూర్ వచ్చి ఎయిర్‌పోర్టు స్థితిగతులను పరిశీలిస్తానని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఏవియేషన్ డైరెక్టర్ భరత్‌రెడ్డి, ఆర్ ఆండ్ బి స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com