Wednesday, October 2, 2024

మూసీ అభివృద్ధిని అడ్డుకుంటే ప్రత్యక్ష ఉద్యమం చేస్తాం

  • మూసీ అభివృద్ధిని అడ్డుకుంటే ప్రత్యక్ష ఉద్యమం చేస్తాం
  • ప్రతిపక్షాలకు మానవత్వం లేదు
  • నల్గొండ జిల్లా గ్రౌండ్ వాటర్‌లో ఫ్లోరైడ్ ఎక్కువ ఉంది
  • మూసీలో పారేది విషపు నీళ్లు
  • మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను తరలించి
  • మూసీని శుద్ధిచేయడమే మా ప్రధాన ఉద్ధేశం
  • మూసీ ప్రక్షాళనను ఎందుకు ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి
  • మూసీపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళదామా….?

మూసీ అభివృద్ధిని అడ్డుకుంటే ప్రత్యక్ష ఉద్యమం చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మంత్రుల క్వార్టర్స్‌లో మీడియాతో మాట్లాడుతూ మూసీని శుద్ధి చేయడానికి ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుందన్నారు. ప్రతిపక్షాలకు మానవత్వం లేదని ఆయన మండిపడ్డారు. కెసిఆర్, కెటిఆర్, హరీష్‌రావులకు మానవత్వం లేదని ఆయన విమర్శించారు. నల్గొండ జిల్లా గ్రౌండ్ వాటర్‌లో ఫ్లోరైడ్ ఎక్కువ ఉందని ఆయన తెలిపారు. పది సంవత్సరాలు పాలించి లక్షల కోట్లు దోచుకున్నారని ఆయనఆరోపించారు. మూసీలో పారేది విషపు నీళ్లని, తెలంగాణ వచ్చాక మూసీ స్థితి మారుతుందని అనుకున్నామని, కానీ, బిఆర్‌ఎస్ కోట్లను దోచుకుందని మంత్రి దుయ్యబట్టారు. మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను తరలించి, మూసీని శుద్ధిచేయడమే తమ ప్రధాన ఉద్ధేశమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. మూసీ అభివృద్ధిని అడ్డుకుంటే తాము ప్రత్యక్ష ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు. నల్గొండ జిల్లా గ్రౌండ్ వాటర్‌లో ఫ్లోరైడ్ ఎక్కువని, మూసీలో పారేది విషపు నీళ్లని తెలిసి కూడా దానిని అడ్డుకోకుండా ప్రతిపక్షాలు అడ్డు తగులుతున్నాయని ఆయన ఆరోపించారు. మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే, ఎందుకు ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు.

కెసిఆర్‌కు అసెంబ్లీకి వచ్చే ముఖం లేదు

కెసిఆర్‌కు అసెంబ్లీకి వచ్చే ముఖం లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలకు కెసిఆర్ వచ్చి మూసీ ప్రక్షాళనపై మాట్లాడాలన్నారు. కెసిఆర్, కెటిఆర్‌లు మా ఊరిలో బస చేయాలని, మా ఊరిలో కనీసం వారు టిఫిన్ కూడా చేయలేరని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి ‘మాయమై పోతున్నాడమ్మా మనిషిన్నవాడు’ అనే పాటను గుర్తు చేశారు. మీరు మనుషులేనా? కనీసం మానవత్వం లేదా? మూసీ డెవలప్‌మెంట్ బోర్డు అన్నావ్ కదా ఏమైంది? లక్షల కోట్లు సంపాదించావు, పేదలపై కొంచెం కూడా జాలి లేదా? కాళేశ్వరం ఒక తుగ్లక్ పని, మల్లన్న సాగర్ నిర్వాసితులను గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో చూశాం, మూసీ పరిస్థితి ఎలా ఉందో కెసిఆర్ దగ్గర ఓఎస్డీగా పనిచేసిన ప్రియాంక వర్గీస్‌ను అడగండి. మల్లన్న సాగర్ నిర్వాసితులను పోలీసులతో ఎందుకు కొట్టించారు. మూసీ ప్రక్షాళన చేస్తే కమీషన్ రాదని మొదలు పెట్ట లేదా? పదేండ్లు అధికారంలో ఉండి పార్లమెంట్ ఎన్నికల్లో అలా ఓడిపోవడానికి సిగ్గు లేదా? అంటూ మంత్రి కోమటిరెడ్డి బిఆర్‌ఎస్ నాయకులపై విమర్శలు గుప్పించారు.

నల్గొండ వ్యక్తిగా, మూసీ బాధితుడిగా మాట్లాడుతున్నా…

మూసీవల్ల కలిగే ఇబ్బంది తెలిస్తే జర్నలిస్టులు కూడా సహించరన్నారు. మూసీపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్దామా అని మంత్రి కోమటిరెడ్డి సవాల్ విసిరారు. తాను నల్గొండ వ్యక్తిగా, మూసీ బాధితుడిగా మాట్లాడుతున్నానని మంత్రి పేర్కొన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ వాళ్లు గోదావరి జలాలతో సంతోషంగా ఉండాలన్నారు. తాము మూసీ మురికితో చావాలా అని మంత్రి కోమటిరెడ్డి నిలదీశారు. హరీశ్ రావో, అగ్గిపెట్టే రావో వెళ్లి మూసీ దగ్గర ఉంటే రోగాలు వస్తాయని చెప్పాలని ఆయన సూచించారు. ఎంత ఖర్చయినా పెట్టి మూసీని ప్రక్షాళన చేయాలని సిఎంకు చెప్పినట్లు మంత్రి తెలిపారు. డిపిఆర్ రెడీ కాకుండా అవినీతి ఎక్కడ అవుతుంది? కెటిఆర్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి మండిపడ్డారు. మూసీకంపు బిఆర్‌ఎస్ నేతలకు కనిపించడం లేదా అని ఆయన నిలదీశారు. మూసీ కలుషిత నీటితో పండించిన పంటలు తిన్నా అనారోగ్యమేనని, ఎంత ఖర్చు అయినా మూసీ నరకం నుంచి తమ జిల్లా ప్రజలను బయటపడేయాలని మంత్రి కోరారు. నల్గొండ జిల్లా అంటే కెసిఆర్‌కు కక్ష అని ఆయన అన్నారు.

ఫార్మా ఇండస్ట్రీల నుంచి వచ్చే కెమికల్స్ మూసీలో కలుస్తాయి

హైదరాబాద్‌లో ఉన్న ఫార్మా ఇండస్ట్రీల నుంచి వచ్చే కెమికల్స్ అన్నీ నల్గొండ జిల్లాలో ఉండే కృష్ణానదిలో కలుస్తున్నాయని, అదంతా కలుషితమైన నీరేనని ఆయన వివరించారు. గత ప్రభుత్వం మూసీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరుతో రూ.1,000 కోట్లు అప్పు చేసిందని, దానిని కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కొనుగోలు చేసి చైర్మన్‌ను చేసిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో మూసీ నదిని శుద్ధిచేసి మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీటితో నింపుతామని, నల్గొండ ప్రజలకు ఇకపై స్వచ్ఛమైన త్రాగునీటిని అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. అమెరికాలో చదువుకున్న కెటిఆర్‌కు అసలు కామన్ సెన్స్ లేదని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. మూసీపై ఏమైనా అనుమానాలుంటే కెటిఆర్, హరీష్ రావులు రీసెర్చ్ చేసుకోవాలని మంత్రి సూచించారు. మూసీ పరివాహక ప్రాంతానికి వచ్చి ఆ కంపుతో రోగాల బారిన పడుతున్న ప్రజల్ని చూశాక ప్రక్షాళనపై మాట్లాడాలని ఆయన సవాల్ విసిరారు.

రెండు దశాబ్ధాలుగా పోరాటం చేస్తున్నా

రెండు దశాబ్ధాలుగా ఫ్లోరైడ్, మూసీ శుద్ధీకరణ మీద పోరాటం చేస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ప్రధానితో పాటు కేంద్రంలో ఎందరో మంత్రులను కలిసి మూసీ శుద్ధీకరణకు నిధులు కేటాయించాలని వినతులు ఇచ్చానని ఆయన పేర్కొన్నారు. తాను తిరగని ఇళ్లు లేదని, తాను కేంద్రంలో కలవని నాయకుడు లేరని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్ నాయకులు మూసీ బాధితులను తెలంగాణ భవన్‌కు పిలిపించుకొని జనతాగ్యారేజీ అని సోషల్ మీడియాలో తిప్పుకుంటున్నారని, మీది జనతా గ్యారేజ్ కాదు, జనాన్ని ముంచే గ్యారేజీ అని, జనాల్ని వంచించే గ్యారేజీ అని, అందుకే మీ కారు గ్యారేజీకి పరిమితమయ్యిందని ఆయన తెలిపారు. మిషన్ భగీరథ పేరుతో గత ప్రభుత్వం చేసిన ప్రజాధనం వృధాను కేంద్ర జలశక్తి నివేదిక ఇటీవల తేటతెల్లం చేసిందని ఆయన తెలిపారు. నల్గొండ భూగర్భంలో ఇంకా ఫ్లోరైడ్ జడలు విప్పుకొని కూర్చుందని అధికారుల నివేదికలో తేలిందన్నారు.

నదులనీటి నాణ్యతా ఇండెక్స్‌లో

ఈ మధ్య విడుదల చేసిన నదులనీటి నాణ్యతా ఇండెక్స్‌లో మూసీరివర్‌లో ఆక్సిజన్ స్థాయిలను ప్రభావితం చేసే టర్బిడిటీ స్థాయిలు 1-4 మధ్యన ఉండాలి, కానీ, ఇది దామరచర్ల దగ్గర 15గా ఉందని, వలిగొండ దగ్గర 13గా నమోదయ్యిందని, వాడపల్లి దగ్గర 13గా ఉందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. బిఓడి (బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్) స్థాయిలు 3 మిల్లీ గ్రాముల కంటే తక్కువ ఉండాలి, కానీ, వలిగొండ దగ్గర 10.01 శాతం ఉందన్నారు. డయేరియా, జ్వరం, చర్మవ్యాధులకు కారణమయ్యే భయంకరమైన కొలిఫాం బ్యాక్టీరియా త్రాగునీటిలో అసలే ఉండకూడదని, కానీ, మన దామరచర్లలో 1,400గా ఉందని, వలిగొండ ప్రాంతంలో 2,200గా నమోదయ్యిందన్నారు.

గత ప్రభుత్వంలో ఎస్టీపిలు కట్టలేదు….

హెచ్‌ఎండిఏ పరిధిలోని ఇళ్ల నుంచి వచ్చే డ్రైనేజీ నీళ్లు, వ్యర్ధ పదార్థాలన్నీ ఇప్పుడు మూసీలోనే కలుస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ విషపు నీళ్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా మీదుగా కృష్ణాలో కలుస్తూ అందరికీ విషాన్ని పంచుతున్నాయన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలన వల్ల హైదరాబాద్‌లో నిత్యం 2,000 ఎంఎల్డీల వరకు మురుగు, రసాయనాలతో కూడిన వ్యర్థజలాలు మూసీలో కలుస్తున్నాయన్నారు.

70 వేల పుస్తకాలు చదివిన కెసిఆర్‌కు మూసీ గురించి తెలియకపోవడం బాధాకరమన్నారు. ఎస్టీపిలు కట్టామని ప్రచారం చేస్తున్న బిఆర్‌ఎస్ నాయకులు అప్పట్లో కేవలం ప్రతిపాదనలు మాత్రమే తయారు చేసి కాలక్షేపం చేశారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. మూసీలో ఇళ్లు కోల్పోతున్న వారికి అన్ని విధాలా న్యాయం చేస్తామని మంత్రి హామీనిచ్చారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular