బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి చెందిన సీఎంఆర్ కాలేజీపై తెలంగాణ సర్కార్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయని ఇటీవల స్టూడెంట్స్ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటనపై అధికారుల ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. హాస్టల్ నిర్వహణ సరిగా లేదని గుర్తించినట్లు తెలుస్తోంది. సీక్రెట్ కెమెరాల వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే.. ఈ ఘటనపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
సోమవారం ఏ జరగనుంది?
కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా మల్లారెడ్డి కాలేజీపై యాక్షన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అవసరం అయితే కాలేజీని సీజ్ చేసే అవకాశం కూడా ఉందన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం మల్లారెడ్డి కాలేజీని పోలీసుల ఆదేశాలతో మూడు రోజుల పాటు క్లోజ్ చేసింది యాజమాన్యం. సోమవారం కాలేజీ తిరిగి తెరుచుకోనుంది. కాలేజీ తెరిచిన తర్వాత మళ్లీ ఆందోళనలు చేస్తామని విద్యార్థులు, స్టూడెంట్స్ యూనియన్ లీడర్లు హెచ్చరిస్తున్నారు. దీంతో సోమవారం ఏం జరగనుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
మహిళా కమిషన్ ఆదేశాలు
మరోవైపు ఈ విషయంలో మహిళా కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. గర్ల్స్ హాస్టల్ ఘటన కేసును సుమోటోగా తీసుకుంటున్నామని చెప్పింది. విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది మహిళా కమిషన్. ఇక పోలీసులు కూడా ఈ విషయంపై చాలా సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్ సిబ్బందిని విచారిస్తున్నారు. వారి దగ్గర నుంచి తీసుకున్న ఫోన్లలో వీడియోలను పరిశీలిస్తున్నారు. హాస్టల్ గదిలోని ఒక బాత్రూం వద్ద కిటికీలో నుంచి ఒక అగంతకుడు తొంగి చూశాడని ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. వెంటనే స్పాట్ కు చేరుకుని కిటికీ పై ఉన్న ఫింగర్ ప్రింట్స్ క్లూస్ సేకరించినట్లు వివరిస్తున్నారు. అలాగే హాస్టల్ వెంటిలేటర్ మీద కూడా వేలిముద్రలు కనిపించాయని పోలీసులు చెబుతున్నారు.