- కువైట్ లో చిక్కుకున్న మహిళకు సాయం
- క్షేమంగా స్వస్థలానికి చేరిన వరగంటి సుగుణ
అమరావతిః విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఏజెంట్ చేతిలో మోసపోయి కువైట్ లో చిక్కుకున్న మహిళను రక్షించి క్షేమంగా స్వస్థలానికి చేర్చారు. జీవనోపాధి కోసం తిరుపతి రూరల్ మండలం కుంట్రపాకం గ్రామానికి చెందిన వరగంటి సుగుణ కువైట్ వెళ్లారు. అయితే అక్కడకు వెళ్లిన తర్వాత అనేక ఇబ్బందులు పడుతున్నానని, ఏజెంట్ మోసం చేశారని ఎక్స్ వేదికగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తీవ్ర అనారోగ్యం బారినపడిన తాను తిండిలేక అల్లాడుతున్నానని, ఎలాగైనా రక్షించి స్వస్థలానికి చేర్చాలని వీడియో ద్వారా మంత్రి నారా లోకేష్ ను విజ్ఞప్తి చేశారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి లోకేష్.. తన టీం ద్వారా వరగంటి సుగుణను క్షేమంగా రాష్ట్రానికి తీసుకువచ్చి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. సాయం అడిగిన వెంటనే స్పందించి అండగా నిలిచిన మంత్రి నారా లోకేష్ కు సుగుణ, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.