Saturday, December 28, 2024

Nara Lokesh met Satyanadella మైక్రో సాఫ్ట్ సిఇఓ సత్యనాదెళ్లతో మంత్రి నారా లోకేష్ భేటీ!

  • డిజిటల్ గవర్నెన్స్ కు సాంకేతిక సహకారం అందించండి
  • అమరావతిని ఎఐ క్యాపిటల్ గా తీర్చిదిద్దేందుకు సహకరించండి
  • ఒకసారి ఎపిని సందర్శించాల్సిందిగా సత్య నాదెళ్లకు లోకేష్ ఆహ్వానం
  • లోకేష్ తో ఫోటోలు దిగిన మైక్రో సాఫ్ట్ తెలుగు ఉద్యోగులు

ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం, మైక్రో సాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్లతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ రెడ్ మండ్ లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మైక్రో సాఫ్ట్ లో పనిచేసే తెలుగు ఉద్యోగులు లోకేష్ తో ఫోటోలు దిగారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సత్య నాదెళ్ల తన అపారమైన మేథస్సుతో అంచెలంచెలుగా ఎదిగి మైక్రోసాఫ్ట్ సిఇఓ స్థాయికి చేరుకున్నారు. సత్య నాదెళ్ల తండ్రి బిఎన్ యుగంధర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐఎఎస్ అధికారిగా గ్రామీణ ప్రాంత ప్రజల జీవన స్థితిగతులను మార్చేందుకు విశేషంగా కృషిచేశారు. కృత్రిమ మేధ (ఎఐ), క్లౌడ్ కంప్యూటింగ్ లో లోతైన ఆసక్తి కలిగిన సత్య నాదెళ్ల 2014 నుంచి మైక్రోసాఫ్ట్ సిఇఓగా ఆ సంస్థ పురోభివృద్ధికి కృషిచేస్తున్నారు. లోకేష్ తో భేటీ సందర్భంగా సత్య నాదెళ్ల మాట్లాడుతూ… మైక్రోసాఫ్ట్ సంస్థ సాఫ్ట్‌వేర్, క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్ గా ఉందని చెప్పారు. అక్టోబర్ 2024 నాటికి మైక్రోసాఫ్ట్ $3.1 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్ కలిగి ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ దాని క్లౌడ్ సేవలు, ఎఐ -డ్రైవెన్ సొల్యూషన్‌ రంగంలో బలమైన వృద్ధితో $211.9 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించిందని తెలిపారు.

ఐటి హబ్ లకు సహకారం అందించండి

మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… విజనరీ లీడర్ చంద్రబాబు గారి నేతృత్వంలో హైదరాబాద్ నగరం ఐటి హబ్ గా రూపుదిద్దుకున్న విషయం మీకు తెలుసు. ప్రస్తుతం 4వసారి ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన బాబు ఎపిని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఐటీ హబ్‌లు, ఇన్నోవేషన్ పార్కులను నిర్మిస్తున్నాం. ఈ హబ్‌లను ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో మైక్రోసాఫ్ట్ సహకారం అవసరం. క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్‌ల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ ప్రపంచస్థాయి సంస్థలకు ప్రాంతీయ కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయి. అటువంటి పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు, భూమి మావద్ద అందుబాటులో ఉన్నాయి. క్లౌడ్ సేవల్లో మైక్రోసాఫ్ట్ నాయకత్వంతో కలిసి మేము అత్యాధునిక సాంకేతిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని భావిస్తున్నాం.

ఎపిలోని ఐటి టాలెంట్ పై దృష్టి సారించండి

మన రాష్ట్రం అత్యుత్తమ ఐటి, ఇంజనీరింగ్ ప్రతిభావంతులను తయారుచేసే బలమైన విద్యావ్యవస్థను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ఐటి నిపుణులు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన సేవలు అందిస్తున్న విషయం మీకు తెలుసు. ఎపిలో ఐటి, ఇంజనీరింగ్ టాలెంట్ పై దృష్టి సారించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక. ఆగ్రిటెక్ కు ఎఐని అనుసంధానించడం వల్ల మన రాష్ట్ర వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. మైక్రోసాఫ్ట్ సాంకేతిక నైపుణ్యంతో ఉత్పాదకతను పెంచే వ్యవసాయ విధానాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా స్ట్రీమ్‌లైన్డ్ అప్రూవల్స్, ఫాస్ట్-ట్రాక్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, ప్రో-బిజినెస్ పాలసీలతో ఆంధ్రప్రదేశ్ వ్యాపార, వాణిజ్యరంగాలకు వేగవంతమైన సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఎపిలో సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ గవర్నెన్స్ వ్యూహాత్మక లాజిస్టిక్ లకు అనువుగా ఉంటాయి. దీనికి బలమైన పర్యావరణ వ్యవస్థ మద్దతుగా నిలుస్తుంది.

ఎఐ క్యాపిటల్ గా అమరావతిని తీర్చిదిద్దుతాం

క్లౌడ్-ఆధారిత ప్లాట్‌ఫాం లను అమలు చేయడం, డేటా అనలిటిక్స్ కోసం ఎఐని ఉపయోగించడం, సైబర్‌ సెక్యూరిటీని మెరుగుపరచడం, స్మార్ట్ సిటీ కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరించే డిజిటల్ గవర్నెన్స్ విధానాలకు మైక్రో సాఫ్ట్ సహకారాన్ని కోరుతున్నాం. ఎఐ ప్రాజెక్టులకు అనువుగా ఉన్న అమరావతిని ఎఐ క్యాపిటల్ గా తయారు చేయాలని భావిస్తున్నాం. ఇందులో భాగంగా అమరావతిలో ఎఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, డైనమిక్ టెక్ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం.

వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆవిష్కరణల కోసం ఎపి ప్రభుత్వంతో కలసి పనిచేయాల్సిందిగా కోరుతున్నాం. ఎపిలో నెలకొన్న మౌలిక సదుపాయాలు, సాంకేతిక పర్యావరణ వ్యవస్థను ఒకసారి మా రాష్ట్రానికి వచ్చి పరిశీలించండి. ఎపిలో పెట్టుబడులకు గల అవకాశాలను పరిశోధించండి. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి ప్రణాళికల్లో అధునాతన సాంకేతికను ఏకీకృతం చేయడానికి భాగస్వామ్యం వహించాల్సిందిగా మంత్రి లోకేష్ మైక్రోసాఫ్ట్ సిఇఓను కోరారు. ఏపిలో డిజిటల్ ట్రాన్ఫార్మేషన్, ఏఐ రంగాల అభివృద్ధికి సహకరిస్తామని సత్య నాదెళ్ల చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృంద సభ్యులు కార్తికేయ మిశ్రా, సాయికాంత్ వర్మ పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com