Monday, April 21, 2025

ఆందోళన వద్దు, అన్ని విధాలా ఆదుకుంటాం

  • రానున్న 24 గంటలు మరింత అప్రమత్తంగా ఉండాలి
  • జిల్లా కలెక్టర్లు, ఎస్ పీలతో మంత్రి పొంగులేటి  వీడియో కాన్ఫరెన్స్
రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండి ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు.
ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుదని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితులు, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో తన నియోజకవర్గంలో  నెలకొన్న పరిస్థితులపై ఆదివారం ఉదయం నుంచి ఎప్పటికప్పుడు రాష్ట్ర  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్ లతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్.పి.లతో సమీక్షించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు అప్పటికప్పుడు అవసరమైన ఆదేశాలను జారీ చేశారు.
మధ్యాహ్నం 12 గంటలకు  జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్.పీ లతో రాష్ట్ర సచివాలయంనుండి  శాంతి కుమారి, డీజితేందర్ లతో కలసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్, వైద్య ఆరోగ్య, నీటి పారుదల, రెవిన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్, జీహెచ్ఎంసీ, జలమండలి, ట్రాన్స్కో తదితర శాఖల అధికారులు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడే ఉపద్రవాన్ని ముందస్తుగా ఎదురుర్కొనేందుకు చేపట్టిన చర్యల వల్ల చాలా వరకు ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా కాపాడగలిగామన్నారు.  వీలైనంత వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు.
అయితే ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా  రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంఘటనలలో తొమ్మిది మంది చనిపోయారని… ఇది చాలా దురదృష్టకరం, విచారకరమని వ్యాఖ్యానించారు. అలాగే ఖమ్మం జిల్లా నా నియోజకవర్గం పాలేరులో వరదల్లో చిక్కుకున్న ఒక కుటుంబాన్ని రక్షించడానికి చేయని ప్రయత్నంమంటూ లేదన్నారు. నేవీ, డిఫెన్స్, హకీంపేట లో హెలికాప్టర్లను సిద్ధం చేసినా వాతావరణం అనుకూలించక అవి అక్కడికి వెళ్లలేకపోయాయన్నారు. వరదల్లో ఇంటిపైకి ఎక్కిన ఒకే కుటుంబలోని ముగ్గురు వరదల్లో కొట్టుకుపోయారని… అందులో ఒకరిని రక్షించగలిగామన్నారు. మరో ఇద్దరినీ రక్షించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
గోదావరీ, కృష్ణా నదులతో పాటు పలు వాగుల ద్వారా వచ్చే వరదను ఎప్పటి కప్పుడు అంచనా వేసి పకడ్బందీగా నీటిని వదలడం వల్ల పెద్దగా చెరువులు, కుంటలకు పెద్దగా నష్టం వాటిల్లలేదన్నారు. అయినప్పటికీ, రాష్ట్రంలో అన్ని చెరువులు పూర్తి స్థాయిలో నిండి, మరింత వరద వస్తే తెగే ప్రమాదమున్నందున, అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రధానంగా మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో వరదలు, వర్షాల ప్రభావం అధికంగా ఉండి నీటిలో చిక్కుకున్న పలువురు గ్రామీణులను సురక్షితంగా కాపాడ గలిగామన్నారు.
పరిస్థితుల తీవ్రత దృష్ట్యా అన్ని స్థాయిల అధికారులు, సిబ్బందికి సెలవుల మంజూరు రద్దు చేయాలని చీఫ్ సెక్రెటరీ ని ఆదేశించామన్నారు. స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని కలెక్టర్లను సూచించడం జరిగిందన్నారు.హైదరాబాద్ తో పాటు జీహెచ్ఎంసి పరిధిలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలకు అవకాశం ఉండడంతో  సెలవు ప్రకటించాలని ఆదేశించడం జరిగిందన్నారు..
 జీహెచ్ఎంసి పరిధిలో పాత ఇండ్లు గోడలు నాని కూలే పరిస్థితి ఉండడంతో ముందస్తుగా వారిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. మహబూబాబాద్, డోర్నకల్ మధ్య భారీ రైల్వే లైను పై వర్షం నీరు చేరుకోవడంతో రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. రైలులో ఉన్న ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వ తరపున భోజన వసతి కల్పించి బస్సులు ఏర్పాటు చేసి వారిని అక్కడినుంచి తరలించడం జరిగిందన్నారు. సామాన్యులకు ఇబ్బంది లేకుండా ఎక్కడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా  ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇందులో భాగస్వామ్యమై ప్రజలకు అండగా నిలవాలని కోరారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com