అంగన్వాడీ వర్కర్స్‌కు రాష్ట్రం ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ‘అమ్మ మాట- అంగన్వాడీ బాట’లో భాగంగా హైదరాబాద్ రహమత్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్‌కు రూ.2 లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం జీవో విడుదల చేస్తుందని వెల్లడించారు.
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల భవనాల్లో కొనసాగుతున్న సుమారు 15 వేల అంగన్వాడీ కేంద్రాలను తొలిదశలో ఉన్నతీకరిస్తున్నది. వాటిని పూర్వ ప్రాథమిక విద్య (ప్రీప్రైమరీ) పాఠశాలలుగా తీర్చిదిద్దుతున్నది. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే వాటిని అందుబాటలోకి తీసుకొచ్చింది.