నాయకులు వెనుక ఉండి కుట్రలు చేస్తున్నారు
రాజకీయ దురుద్దేశంతోనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఇథనాల్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చింది గత ప్రభుత్వమే
తలసాని కుమారుడితో పాటు 10 మంది డైరెక్టర్లు
రెచ్చగొట్టే వైఖరిని బిఆర్‌ఎస్ అవలంబిస్తోంది
యూట్యూబ్ చానళ్లలో ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారం
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
గురుకులాల్లో జరిగే కుట్రలన్నీ త్వరలోనే బయటపెడతామని, త్వరలోనే అన్నీ వెలుగులోకి వస్తాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతోనే తమ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. హాస్టల్‌లలో ఫుడ్ పాయిజన్ మీద అనేక కుట్రలు జరుగుతున్నాయన్న అనుమానాలు తమకు ఉన్నాయని, అధికారులు ఎవరైనా కుట్రలకు సహకరిస్తే వారిపై చర్యలు తప్పక తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. రాజకీయ నాయకులు వెనుక ఉండి కుట్రలు చేస్తున్నారన్న అనుమానాలు తమకు ఉన్నాయని, ఆధారాలతో బయటపెట్టి చర్యలు తీసుకుంటామని సీతక్క తెలిపారు. ఫుడ్ పాయిజన్ ఘటన మీద ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ, ఇతర మంత్రులు శైలజను పరామర్శించారని మంత్రి సీతక్క తెలిపారు.
తమ ప్రభుత్వం మృతురాలి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా నిలిచిందన్నారు. ఆ విద్యార్థికి 25 రోజులు చికిత్స అందించామని, రూ. 15 లక్షలు వైద్య ఖర్చులు చేశామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ హయాంలో ఎన్నో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయని, ఎంతోమంది విద్యార్థులు మరణించారని ఆమె తెలిపారు. విద్యార్థుల మరణాలకు సంబంధించి ఇవే ఆధారాలు బిఆర్‌ఎస్ హయాంలో మరణించిన విద్యార్థుల జాబితాను సీతక్క మీడియాకు విడుదల చేశారు. బిఆర్‌ఎస్ పాలనలో విద్యార్థులు మరణించినప్పుడు పట్టించుకోలేదని, కనీసం వారిని పరామర్శించలేదని, పైసా పరిహారం ఇవ్వలేదని సీతక్క ఆరోపించారు. శైలజ కుటుంబానికి తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు.
అనుమతి పత్రాలపై కెసిఆర్, కెటిఆర్ సంతకాలు
నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీకి గత ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందని, అనుమతి పత్రాలపై కెసిఆర్, కెటిఆర్ సంతకాలు ఉన్నాయని ఆమె చెప్పారు. అనుమతి ఎవరిచ్చారో అనే అంశంపై బిఆర్‌ఎస్ నాయకులు సిద్ధం కావాలన్నారు. ఈ పరిశ్రమకు మాజీ మంత్రి తలసాని కుమారుడు సాయికిరణ్ యాదవ్, తలసాని వియ్యంకుడు పుట్టా సుధాకర్ కొడుకుతో పాటు మరో 10 మంది డైరెక్టర్లుగా ఉన్నారని ఆమె చెప్పారు. కడప జిల్లాకు చెందిన పుట్ట సుధాకర్ కుమారుడు కూడా డైరెక్టర్ గా ఉన్నారని ఆమె పేర్కొన్నారు.
ఆనాడు గ్రామ సభలు అవసరం లేదని బిజెపి సపోర్ట్ చేసిందన్నారు. తప్పుడు ప్రచారాలో మనుగడ సాధించలేరని ఆమె అన్నారు. యూట్యూబ్ చానళ్లలో ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని, ఇథనాల్ పరిశ్రమ వివాదంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని ఆమె సవాల్ విసిరారు. ప్రజలను తప్పుదోవ పట్టించే చిల్లర, కుళ్ళు రాజకీయాలు బిఆర్‌ఎస్ చేస్తోందని ఆమె ఆరోపించారు. తప్పులు చేసింది, విధ్వంసం చేసింది బిఆర్‌ఎస్ అని, మళ్లీ ప్రజలను రెచ్చగొట్టేది కూడా వారేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులను నిర్బంధించడం, దాడులకు, కుట్రలకు పాల్పడడం…
అధికారులను నిర్బంధించడం, దాడులకు, కుట్రలకు పాల్పడడం బిఆర్‌ఎస్ నైజమని ఆమె అన్నారు. వాస్తవాలు ఆలస్యంగా అయినా బయటకి వస్తాయన్నారు. కెటిఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే దిలవార్‌పూర్‌కు కెటిఆర్ రావాలని తాను కూడా వస్తానని ఆమె పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో కొండపోచమ్మ, మల్లన్నసాగర్‌లలో రాత్రికి రాత్రి రైతులను ఊర్లు ఖాళీ చేయించారని, తాము అలా చేయడం లేదని, దిలవార్ పూర్‌లో గ్రామ సభలు జరుగుతున్నాయని, ఆ తర్వాత ప్రభుత్వం ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు.
పాంహౌస్ నుంచే గురుకులాలపై కుట్రలు: ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్
ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, కాల్వ సుజాత మాట్లాడుతూ రాజకీయాల కోసం బిఆర్‌ఎస్ నాయకులు ఎవరినైనా బలి చేస్తారన్నారు. పాంహౌస్ నుంచే గురుకులాలపై కుట్రలు జరుగుతున్నాయన్నారు. అధికారులను పంపించి పాంహౌస్‌లో జరుగుతున్న కుట్రలను బయట పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నానన్నారు.
అన్ని కుట్రల వెనుక బిఆర్‌ఎస్ హస్తం: మహిళ కార్పొరేషన్ చైర్మన్
మహిళ కార్పొరేషన్ చైర్మన్, బండ్రు శోభారాణి మాట్లాడుతూ లగచర్ల, దిలావర్‌పూర్‌లో అధికారుల మీద దాడులు, గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటన వెనుక బిఆర్‌ఎస్ కుట్ర దాగి ఉందన్నారు. హాస్టల్‌లో జరుగుతున్న కుట్రల వెనుక ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కుట్ర ఉందన్నారు. ఆర్ ప్రవీణ్ కుమార్, కెటిఆర్ కనుసన్నల్లోనే ఈ కుట్రలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడ అలజడులు జరుగుతున్నా దాని వెనుక బిఆర్‌ఎస్ కుట్రలు దాగి ఉంటయన్నారు. అధికార దాహం కోసం విద్యార్థుల ప్రాణాలు బలిచేయాలన్న కుట్ర జరుగుతోందన్నారు. ఈ కుట్రలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణ చేపట్టాలన్నారు.
ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల బాట ఎందుకు పట్టారు: ఎమ్మెల్యే, కవ్వంపల్లి
మానకొండూరు ఎమ్మెల్యే, కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల బాట ఎందుకు పట్టారో చెప్పాలన్నారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ గురుకులాల బాట కాకుండా పాంహౌస్ బాట పడితే బాగుండేదన్నారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్రటరీ గా ఉన్నప్పుడు జరిగిన స్కాంపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నానన్నారు. అందరూ ఒకే దగ్గర చదువుకోవాలని కాంగ్రెస్ గురుకులాలు తెస్తే బిఆర్‌ఎస్ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి కులాల వారీగా గురుకులాలు ఏర్పాటు చేసిందన్నారు.