ప్రజా పాలనలో భాగమై నిత్యం ఏదో ఒక కార్యక్రమాల్లో బిజీగా ఉండే మంత్రి సీతక్క నిత్య విద్యార్థిగా నిలుస్తున్నారు. సారం లేని భూమి, చదువు లేని జీవితం ఒక్కటే అని బలంగా నమ్మే సీతక్క ‘అధ్యయనం పోరాటం’ అనే సూత్రాన్ని అనుసరిస్తున్నారు. అధికార బాధ్యతలు నిర్వర్తిస్తూనే చదువుకు ప్రాధాన్యతనిస్తున్నారు.
ప్రజా సేవలోనే ఉంటూ ఎల్ఎల్బీ, రాజనీతి శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేసిన సీతక్క తాజాగా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రారంభమైన ఎల్ఎల్ఎం రెండో సంవత్సర పరీక్షలకు హాజరయ్యారు. మంత్రి స్థానంలో పరీక్ష రాయడానికి వచ్చిన సీతక్కను చూసి విద్యార్థులు ఆశ్చర్యపోయారు. అందరి విద్యార్థులతో సమానంగా ఒక విద్యార్థినిగా సీతక్క పరీక్ష రాశారు. తన అధికార నివాసమైన ప్రజాభవన్‌లోనే ఎల్ఎల్ఎం పరీక్షకు సిద్ధమయ్యారు.
ఆదివాసీ పల్లెల నుంచి పీహెచ్డీ వరకు
అడవి నుంచి అధికారం వరకు ఆదివాసీ పల్లెల నుంచి పీహెచ్డీ వరకు ఆమె ప్రస్తానంలో ఎన్నో మలుపులు, మరెన్నో కష్టాలు. ప్రజల కోసం ప్రజల పక్షాన అడవి బాట పట్టిన ఒకప్పటి సీతక్క ఇప్పుడు ఆ అడవి బిడ్డల ఆశలకు, వారి అభివృద్ధికి వారధి. ఆమెది చిన్నపటి నుంచి తమ ఉద్యమ ప్రభావిత ప్రాంతం. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు వచ్చిన గుత్తికోయలు ఎదుర్కొంటున్న సమస్యలపై పీహెచ్డీ చేశారు.
చదువుకునే రోజుల్లోనే చిన్న చిన్న సమస్యలపై ప్రశ్నించడం, పేదలకు సహాయం చేయడం అలవాటైంది. అనంతరం ప్రజాజీవితంలోకి వచ్చిన తర్వాత తన ఆకాంక్షను నెరవేర్చుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే విద్యపై ఆమెకున్న మమకారాన్ని చాటుకుంటుంది. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు.
మరోవైపు తనకి ఇష్టమైన లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి లాయర్‌గా కూడా ఎన్రోల్మెంట్ చేసుకుంది. తాజాగా లా పీజీ చదువుతూ రెండో సంవత్సర పరీక్షలకు హాజరయ్యారు. అనసూయగా ప్రారంభమై సీతక్కగా ప్రజల మన్ననలు పొంది రాష్ట్ర సర్కార్‌లో మంత్రి పదవి చేపట్టారు. ప్రస్తుతం మహిళా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా ఉన్నారు.