Sunday, October 6, 2024

అంగన్వాడీలకు నాసిరకం వస్తువులు సరఫరా చేస్తే కఠిన చర్యలు

  • ఫ్లయింగ్ స్క్వాడ్స్‌తో నిరంతర తనిఖీలు
  • నాణ్యత లేని గుడ్లు పంపిణీపై మంత్రి సీతక్క ఆగ్రహం

రాష్ట్రంలో అంగన్వాడీలకు నాసిరకం వస్తువులు, సరుకులు సరఫరా చేస్తే ఆయా కాంట్రాక్టర్లపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తీవ్రంగా హెచ్చరించారు. కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యత లేని గుడ్లు పంపిణీ కావడంపై మంత్రి సీరియస్ అయ్యారు. పలు అంగన్వాడీ కేంద్రాల్లో నాసి రకం వస్తువులు సరఫరా అవుతున్నాయన్న వార్తలపై నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడి కేంద్రాల్లో నాణ్యతలేని గుడ్లను పంపిణీ చేస్తే చిన్నారులు, గర్భిణులు, బాలింతలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే అంగన్వాడి సెంటర్లలో నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సచివాలయంలో సోమవారం నాడు మహిళా శిశు సంక్షేమ శాఖ సమీక్ష సమావేశాన్ని మంత్రి నిర్వహించారు.

ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రాల పనితీరును మంత్రి సీతక్క సమీక్షించారు. అంగన్వాడి సెంటర్లకు కాంట్రాక్టర్లు నాసిరకం గుడ్లు, వస్తువులు సరఫరా చేస్తే, వాటిని అంగన్వాడీ కేంద్రాలు తిరస్కరించి ఉన్నతాధికారులకు నివేదించాలని సూచించారు. అలా చేయని పక్షంలో సంబంధిత అంగన్వాడీ టీచర్లు, స్థానిక సిబ్బందిని బాధ్యుల్ని చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అంగన్వాడీల్లో అందుతున్న వస్తువుల నాణ్యతపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదించాలని ఆమె అధికారులకు సూచించారు. నాసిరకం వస్తువులను సరఫరా చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంగన్వాడి లకు సరఫరా చేసే సరుకుల నాణ్యతను నిరంతరం పర్యవేక్షించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించు కోవాలన్నారు. అంగన్వాడి కేంద్రాల్లో వస్తువుల దిగుమతి సమయంలో బయోమెట్రిక్ విధానాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలన్నారు.

అంగన్వాడీ కేంద్రాలకు వస్తువుల సరఫరా చేసే కాంట్రాక్టులను గత ప్రభుత్వం రెండేళ్లకు పొడిగించడం వల్ల కొందరు కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మంత్రి తెలిపారు. అందుకే కాంట్రాక్టుల గడువును తగ్గించే ఆలోచన చేస్తున్నామన్నారు. అంగన్వాడి కేంద్రాలకు సరఫరా అవుతున్న వస్తువుల క్వాలిటీని చెక్ చేసేందుకు జిల్లాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడి కేంద్రాల్లో అందుతున్న సేవలపై థర్డ్ పార్టీతో అధ్యయనం చేయించి లోపాలుంటే సవరిస్తామని పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క తో పాటు మహిళా  శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, మహిళా సంక్షేమ శాఖ కమిషనర్ కాంతి వెస్లీతోపాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

వర్షపు నీటి సంరక్షణలో చురుకుగా పాల్గొనాలి
భూగర్భ జలాలను పెంచడానికి, పట్టణ వరదలను తగ్గించడానికి వర్షపు నీటి సంరక్షణలో అంతా చురుకుగా పాల్గొనాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. తన అధికారిక నివాసమైన ప్రజాభవన్‌లో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థను సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 13,600 చదరపు అడుగుల పైకప్పు విస్తీర్ణంలో ఉన్న ఈ నిర్మాణంలో సంవత్సరానికి సుమారు 1.15 మిలియన్ లీటర్ల వర్షపు నీటినీ సంరక్షించుకోవచ్చునని అన్నారు. నీటి సంరక్షణ ప్రాముఖ్యతను ఆమె నొక్కి చెబుతూ దాహం వేసినప్పుడు బావిని తవ్వలేము, ఆకలిగా వేసినప్పుడు విత్తనాలు వేయడం వల్ల ఉపయోగం లేదని అన్నారు. ముందస్తు ప్రణాళికతోనే వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవాలని సూచించారు. ఇటీవల బెంగుళూరు, ఢిల్లీ వంటి నగరాలలో తలెత్తిన నీటి సంక్షోభాలను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.

పెండింగ్ మ్యాచింగ్ గ్రాంట్ల వివరాల జాబితా ఇవ్వండి
పథకాల వారీగా పెండింగ్ మ్యాచింగ్ గ్రాంట్ల వివరాల జాబితాను సమర్పించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులను పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)పై మంత్రి సీతక్క సచివాలయంలో సోమవారం నాడు సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ తో పాటు పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సెర్ప్ ద్వారా ప్రస్తుతం అమలవుతున్న పథకాల తీరు, బడ్జెట్ ప్రతిపాదనలను మంత్రి సీతక్క అడిగి తెలుసుకున్నారు.

అయితే గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడం వల్ల చాలా వరకు కేంద్ర నిధులను సరిగా వాడుకోలేక పోయామని అధికారులు సీతక్క దృష్టికి తీసుకువచ్చారు. వివిధ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను మంజూరు చేస్తే కేంద్రం నుంచి మరిన్ని నిధులను రాబట్టుకోవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా, తమ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ కోసం అవసరమైన నిధులను కేటాయించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. కేంద్ర నిధులను వినియోగించుకునే విధంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

చిన్నారిపై అసభ్యకర వ్యాఖ్యల ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం
తండ్రి కూతుళ్ళ మధ్య ఉండే అనుబంధాన్ని అనురాగాల్ని కొన్ని మృగాలు అసభ్యంగా వక్రీకరించడం దారుణమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోయిన దుర్మార్గుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. వారి అసభ్యకరమైన ఆలోచనను తండ్రి కూతుళ్లకు అంటగట్టడం దుర్మార్గమైన చర్య-గా మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే ఘటనపై కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు చేస్తున్నామని -సీతక్క వెల్లడించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు, అసభ్య ప్రచారాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని -ఆమె తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular