వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు. ఖమ్మం వరద బాధితుల ఖాతాల్లోకి సెప్టెంబర్ 6 నుంచి రూ. 10 వేల సహాయాన్ని అందిస్తామని ప్రకటించారు. ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయిన వారికి ఇందిరమ్మ పథకం ద్వారా డబుల్ ఇళ్లు మంజూరు చేస్తామని తుమ్మల వెల్లడించారు. గత పదేళ్లలో ఇలాంటి వరదలు ఎప్పుడూ చూడలేదన్న మంత్రి .. ప్రస్తుతం ఖమ్మం పట్టణం వరద ముంపు నుంచి కోలుకుంటుందని చెప్పారు. పేరుకుపోయిన బురదను తొలిగించేందుకు పక్క జిల్లా నుంచి పారిశుధ్య కార్మికులను, ట్రాక్టర్లను తీసుకువస్తున్నామని తెలిపారు.
కాగా వరదల వలన ప్రాణనష్టం జరిగిన బాధితుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా కింద రూ. 5 లక్షలు అందజేస్తామని సీఎం రేవంత్ ఇటీవలే ప్రకటించారు. పశువులు మరణిస్తే రూ. 50 వేలు అందజేయాలని, గొర్రెలు, మేకలు మరణిస్తే రూ. 5 వేలు అందజేయాలని సీఎం రేవంత్ అధికారులకు స్పష్టం చేశారు. పంట నష్టపోయిన రైతులను గుర్తించి ఎకరాకు రూ.10 వేలు పరిహారం అందజేస్తామని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వరద సాయాన్ని పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నారు.