Sunday, December 29, 2024

ఆదర్శ రైతులను నియమించండి

మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరిన రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి

మళ్ళీ తెరపైకి ఆదర్శ రైతుల వ్యవస్థ తెరపైకి వచ్చింది. వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసే దిశగా ఆదర్శరైతుల నియమాకాన్ని పరిశీలించాలని రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ను కలిసి విజప్తి చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2007లో ఆదర్శ రైతుల వ్యవస్థను ప్రవేశపెట్టారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన, సాగులో అనుభవజ్ఞులైన రైతులను ఆదర్శ రైతులుగా నియమించారు. ప్రతి 250మంది రైతులకు ఒక ఆదర్శ రైతును నియమించారు. వారికి రూ.1000 గౌరవ వేతనం ఇచ్చేవారు. అది కూడా వారికి కొన్ని నెలలకొకసారి విడుదలయ్యేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం ఆదర్శ రైతు వ్యవస్థను రద్దు చేసింది. ఒకేసారి 16,841మంది ఆదర్శ రైతులను 2014సెప్టెంబర్ లో కేసీఆర్ ప్రభుత్వం తొలగించింది. వారి స్థానంలో వ్యవసాయ విస్తరణ అధికారులతో రైతులకు అవసరమైన సేవలందించాలని నిర్ణయించింది.

రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరోసారి ఆదర్శ రైతుల నియామక డిమాండ్ ఊపందుకుంది. వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఇతర సభ్యులు గురువారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని కలిసి ఆదర్శరైతుల నియామకం, వ్యవసాయ పనులకు ఉపాధిహామీ పథకం అనుసంధానం, వ్యవసాయ యంత్రాల పనిముట్లపై జిఎస్టీ ఎత్తివేత, విత్తనచట్టంలో మార్పులు, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ లను శక్తివంతం చేసే దిశగా చేపట్టాల్సిన చర్యల గురించి సవివరంగా చర్చించారు. అనంతరం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆదర్శరైతుల నియామకంపై కమిషన్ సభ్యుల సూచనలను అన్నిటినీ క్రోడికరించి ఒక నివేదిక సమర్పించాలని వ్యవసాయశాఖ అడిషనల్ డైరెక్టర్‌ని ఆదేశించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని కమిషన్ సభ్యులకు హామీ ఇచ్చారు.

కమిషన్ చర్చించిన మిగతా అంశాలన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివని, విత్తనచట్టంలో మార్పులు, వ్యవసాయ యంత్రాలు, పనిముట్లపై జీఎస్టీ ఎత్తివేయాలని కేంద్రప్రభుత్వానికి ఇదివరకే విజ్ఞప్తి చేశామని, వ్యవసాయ రంగానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం అంశాలు కేంద్రప్రభుత్వ పరిశీలనలో ఉందని, అయినప్పటికీ ఈ అంశంపై వివిధ మార్గాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని వారికి హామీ ఇచ్చారు. ఆత్మ (అగ్రి టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ) కమిటీల నియమకాన్ని చేపట్టి, త్వరలో వాటి ద్వారా కూడా విస్తరణ కార్యక్రమాలు చేపట్టి వ్యవసాయరంగానికి నూతనోత్తేజం కల్పించే దిశలో ప్రభుత్వం కృషి చేస్తుందని, కమిటీల ద్వారా నిర్వహించే కార్యక్రమాలకు మార్గ నిర్దేశం చేయాలని కమిషన్ సభ్యులను మంత్రి కోరారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com