అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వంలో 2014 లో తెరకెక్కిన చిత్రం ‘మిణుగురులు’. ఆశిష్ విద్యార్ధి, సుహాసిని మణిరత్నం, రఘుబీర్ యాదవ్ మరియు దీపక్ సరోజ్ నటించిన ఈ చిత్రం ఇటీవల 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంర్భంగా అమెరికాలో స్పెషల్ షో వేయడం జరిగింది.
విడుదలైన కొన్ని రోజుల్లోనే టాలీవుడ్ దిగ్గజ నటులు, దర్శక నిర్మాతల నుండి ప్రశంసలందుకుంది ఈ చిత్రం. మెగాస్టార్ చిరంజీవి, స్వర్గస్తులు దర్శకుడు – నిర్మాత దాసరి నారాయణ రావు, దర్శకుడు సుకుమార్, దర్శకుడు శేఖర్ కమ్ముల, పాటల రచయిత చంద్రబోస్ వంటి వారు ఈ చిత్రంలోని సామాజిక అంశాలని, సాంకేతిక విలువలని మెచ్చుకున్నారు.
ఈ సందర్భంగా కృష్ణంశెట్టి మాట్లాడుతూ, “2014 లో చిత్రం విడుదలైనప్పుడు సోషల్ మీడియా పెద్దగా వ్యాప్తి చెందలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విడుదలయ్యుంటే జాతీయ అంతర్జాతీయ మాధ్యమాల్లో వైరల్ అవ్వడమే కాకుండా అందరి నోటా ఒకే మాటగా వెళ్ళేది. ఈ చిత్రంలోని సామాజిక విషయాలు పూర్తిగా పరిశోధించి, నిజ జీవితంలో చూపు లేని పిల్లల దయనీయ పరిస్థితిని చూపించటం జరిగింది.
సరిగ్గా వారం కూడా ఆడని చిత్రాల మధ్య ‘మిణుగురులు’ 10 ఏళ్ళు నిలిచింది అని ఈ కార్యక్రమానికి వచ్చిన ఒక ప్రేక్షకుడు అన్నారు.
‘మిణుగురులు’ 18వ అంతర్జాతీయ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ‘గోల్డెన్ ఎలిఫెంట్’ గెలుచుకుంది. ఇండియా అంతర్జాతీయ డిసెబిలిటీ ఫిలిం ఫెస్టివల్ మరియు ఇతర ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కి ఎంపికైంది. 9వ బెంగళూరు అంతర్జాతీయ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ‘ఉత్తమ చిత్రం’ అవార్డు గెలుచుకుంది. 2014 లో ‘అస్కార్స్’ కి ఉత్తమ చిత్ర జాబితాలో ఎంపికయిన చిత్రాల్లో ‘మిణుగురులు’ కూడా ఉంది. ఆస్కార్ గ్రంథాల్లో శాశ్వత చిత్రాల జాబితాలో ‘మిణుగురులు’ కథ కూడా ఉంటుంది.
అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి జాతీయంగా, అంతర్జాతీయంగా పేరొందిన దర్శకుడు. పోర్ట్ ల్యాండ్, ఒరెగాన్ లోని నార్త్ వెస్ట్ ఫిలిం సెంటర్ లో ఫిలిం మేకింగ్ నేర్చుకున్న ఈయన అమెరికా టివి ఛానల్ ఓపిబి లో కొన్నాళ్ళు పనిచేసారు. తన దర్శక నిర్మాణంలో తీసిన పలు షార్ట్ ఫిలిమ్స్ మరియు డాక్యూమెంటరీలు చాల అవార్డులు గెలుచుకున్నాయి. ఆయన ‘మిణుగురులు’ చిత్రం 2014 లో 7 నంది అవార్డులు గెలుచుకుంది. నేటి పరిస్థితులకి తగ్గట్టుగా ఉండే రొమాంటిక్ ప్రేమ కథ తో ’24 కిస్సెస్’ అనే చిత్రాన్ని తీశారు.
ఆయన తదుపరి కథల వరుసలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో రిలీజ్ అవ్వనున్న గ్లోబల్ మరియు ఓటిటి లో చిత్రాలు ఉండడం విశేషం.