- తల్లి కొడుకుల సంబంధాన్ని వక్రీకరించిన ఖాకీ
- అర్ధరాత్రి మగవాళ్లతో నీకేం పని అంటూ అసభ్య ప్రవర్తన
- కాళ్లావేళ్లా పడిన కనికరించని పోలీసులు
- తల్లి ఎదుటనే కొడుకును చితకబాదిన పోలీసులు
- అర్ధరాత్రి స్టేషన్ బయటే రక్షణ లేకుండా నిలబెట్టిన వైనం
- మిర్యాలగూడ సబ్‌డివిజన్ పరిధిలో అమానవీయ ఘటన
- ఓ పోలీస్‌స్టేషన్‌పై ఎస్‌పీకి బాధితుడి ఫిర్యాదు
అర్ధరాత్రి పూట మగవారితో నీకేంటి పని… ఎందుకు తిరుగుతున్నావు అంటూ అసభ్య ప్రవర్తనతో తల్లి, కొడుకుల రక్త సంబంధాన్ని వక్రీకరిచడమే కాకుండా తల్లి ఎదుటనే కొడుకుని చితకబాదారు అంతటితో ఆగకుండా తల్లిని, కొడుకును మేనమామను అర్ధరాత్రి సమయంలో పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఆరు బయటనే మహిళ అనే కనికరం లేకుండా నిలబెట్టి మానసికంగా చిత్రహింసలకు గురిచేశారు ఆ ఖాకీలు… సార్ మా అమ్మ సార్… అలా తప్పుడు మాటలు వొద్దు సార్…. నన్ను ఇడిసేయ్ అంటూ కన్నీళ్ళతో కాళ్లవేళ్లా పడి బ్రతిమిలాడినా కనికరం లేకుండా పోలీసులు విచక్షణారహితంగా చితకబాది రాక్షస ఆనందాన్ని పొందారు…. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలోని ఓ పోలీస్‌స్టేషన్ సిబ్బంది వ్యవహరించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే..
మిర్యాలగూడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన తల్లి, కొడుకుతో పాటు మామయ్యతో కలిసి చందంపేట మండలం గువ్వలగట్టు గ్రామానికి వెళ్లి వొస్తుండగా మిర్యాలగూడకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పోలీస్ స్టేషన్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా కారులో వొస్తున్న వీరిని రాత్రి 11 గంటల సమయంలో ఆపి డ్రంక్ డ్రైవ్ టెస్ట్ చేశారు. ఆ తర్వాత వాహన కాగితాలు చూపించాలని చెప్పగా కుమారుడు కారు దిగి పోలీసులకు పత్రాలు చూపిస్తున్న సమయంలో తల్లి కారు దిగి రోడ్డుపై నిలబడింది, అది చూసిన ఓ ఖాకీ ఆమె దగ్గరికి వెళ్లి అర్ధరాత్రి పూట మగ వారితో ఎందుకు తిరుగుతున్నావు. ఈ సమయంలో నీకేం పని అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. అది చూసిన కుమారుడు సదరు పోలీసు వద్దకు వెళ్లి ఆమె, మా అమ్మ సార్.. అలా మాట్లాడకండి అని బ్రతిమిలాడుతుండగా వెనుక నుంచి మరో పోలీస్ వొచ్చి చేయి చేసుకున్నట్లు సమాచారం, ఎందుకు కొడుతున్నారు సార్, నేనేమి తప్పు చేశాను.
అంటూ మాట్లాడుతుండగా మరో నలుగురు పోలీసులు వొచ్చి విచక్షణరహితంగా కొట్టడంతో పాటు తల్లిని, కొడుకును, మామయ్యను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి బయట నిలబెట్టినట్లు తెలిసింది. తల్లి కొడుకుల రక్తసంబంధాన్ని వక్రీకరించి పోలీసులు వ్యవహరించిన ఈ దురుసు ప్రవర్తనపై తమకు న్యాయం చేయడంతో పాటు వ్యక్తిత్వం దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్సీకి ఈ నెల 23న వారు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఎన్ని చట్టాలు వొచ్చినా, ఎన్ని మార్పులు వొచ్చినా గానీ కొందరు పోలీసుల తీరులో మార్పులు రావడం లేదనడానికి నిదర్శనంగా ఇలాంటి ఘటనలు నిలుస్తున్నాయి.