* మియాపూర్‌లో ఇద్దరు బిల్డర్ల విధ్వంసం
* కనీస జాగ్రత్తల్ని పాటించాలి
* దుమ్ము రాకుండా చర్యలు తీసుకోవాలి
హైదరాబాద్ లో ని మియాపూర్ లో ఎయిర్ క్వాలిటీ ఈమధ్య 342 గా నమోదు అయ్యింది. మియాపూర్ లోని నరేన్ గార్డెన్స్ వీధిలో ఇద్దరు బిల్డర్లు చేస్తున్న విధ్వంసమే ఇందుకు ప్రధాన కారణం. అందులో ఒకటీ సియా బిల్డర్స్ కాగా మరొక సంస్థ ప్రైమార్క్ బిల్డర్స్. ఈ రెండు నిర్మాణ సంస్థల నిర్లక్ష్యం కారణంగా.. ఇక్కడి చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అటు పీసీబీ అధికారులు కానీ ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కానీ సమస్యను పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.

మియాపూర్‌లోని నరేన్ గార్డెన్స్ రోడ్డులో.. సియా బిల్డర్స్, ప్రైమార్క్ కన్‌స్ట్రక్షన్స్ లు గత కొంతకాలం నుంచి అపార్టుమెంట్లను నిర్మిస్తున్నాయి. ఆరంభం నుంచీ ఈ రెండు సంస్థలు కనీస ప్రమాణాల్ని పాటించడం లేదు. ఎలాంటి ముందస్తు జాగ్రత్తల్ని తీసుకోకుండా.. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బాంబుల మోత మోగించారు. స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చినా.. రాత్రింబవళ్లు పనుల్ని కొనసాగించారు. నిర్మాణాలు చేపట్టేటప్పుడు పక్క అపార్టుమెంట్ల మీద దుమ్మూ, ధూళి పడకుండా చర్యల్ని తీసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఈ రెండు సంస్థలు వెదజల్లే కాలుష్య తీవ్రతను చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. గాలి ప్రమాణాలు ఇక్కడ 342గా నమోదైంది. ఈ విషయాన్ని స్థానికంగా నివసించే ఒక వ్యక్తి.. తమ ఇంట్లో నుంచి ఏయిర్ క్వాలిటీని లెక్కిస్తే నమోదైయ్యిందని సమాచారం.
బిల్డర్ల నుంచి లంచాలు తినడం అలవాటు చేసుకున్న అధికారులు, ప్రభుత్వ సిబ్బంది.. చూసీ చూడనట్లు వదిలేయడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదే కొనసాగితే మియాపూర్ ప్రాంతమంతా ఇదే దుస్థితి తలెత్తే ప్రమాదముంది. ఇప్పటికే ట్రాఫిక్ జామ్‌లతో నిత్యం నరకం అనుభవిస్తున్న ప్రజలు.. ఇక్కడి గాలి కాలుష్యం కారణంగా హడలెత్తిపోతున్నారు. పీసీబీ అధికారులు, చందానగర్ మునిసిపల్ అధికారులు.. ఇప్పటికైనా మొద్దునిద్ర నుంచి లేచి.. ఈ సమస్యల నుంచి తమను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.