బీఆర్ఎస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగెందర్ అనుచరులతో తమకు ప్రాణభయం ఉందని.. బేగంపేట్ ఎక్స్ టెన్షన్ బస్తీవాసులు బేగంపేట్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. బేగంపేట్ ఎక్స్‌టెన్షన్ లో సుమారు వందకు పైగా కుటుంబాలు 20 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాయి. ప్రభుత్వానికి అన్ని పన్నులు చెల్లిస్తున్నామంటూ బాధితులు తెలిపారు. అయితే, తమ భూములు, ఇళ్లను లాక్కున్నారని బస్తీవాసులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి అన్నిరకాల పన్నుల్ని చెల్లిస్తున్నామంటూ తెలిపారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ బస్తీకి ఆనుకుని ఉన్న రెండు ఎకరాల ఖాళీ స్థలాన్ని దానం నాగేందర్ కబ్జా చేసి.. టీడీఆర్ కింద క్లెయిమ్ చేసి 300 కోట్లు కాజేశాడని బస్తీవాసులు ఆరోపిస్తున్నారు. ఈ ఓపెన్ ల్యాండ్‌లోనే భారీ నిర్మాణాన్ని చేపట్టేందుకు సిద్ధమయ్యారని ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న దానం నాగేందర్ అనుచరులు బస్తీవాసుల వీడియోను తీస్తూ భయపెట్టారని.. అదే సమయంలో సదరు అనుచరుడిని బస్తీవాసులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారంలో తమకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుడి నుంచి ప్రాణహాని ఉందని బస్తీవాసులు కేసు పెట్టారు. మరి, ఈ అంశంపై పోలీసులు ఎలా వ్యవహరిస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.