60కి పైగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలను
గతంలో బిఆర్‌ఎస్‌లో చేర్చుకోలేదా…?
ఆనాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి
ప్రలోభపెట్టి, బెదిరించి చేర్చుకుంది ఎవరు?
ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
పదేళ్లలో పార్టీ ఫిరాయింపులకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న కెటిఆర్ నీవు నీతులు చెబుతావా, 60కి పైగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలను చేర్చుకున్న మీరు ఫిరాయింపుల గురించి మాట్లాడతారా అంటూ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆనాడు ప్రగతిభవన్‌లో ఎమ్మెల్యేలకు గులాబీ కండువా కప్పి చేర్చుకున్నది ఎవరు?, ఆనాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి ప్రలోభపెట్టి, బెదిరించి చేర్చుకుంది ఎవరు?, ఆ నాడు విపక్ష శాసనసభ్యులతో రాయబారాలు నడిపి ప్రగతిభవన్‌కు తీసుకుపోయిందో ఎవరో అందరికీ తెలుసనీ ఆయన అన్నారు. రోజుకో ఎమ్మెల్యేను చేర్చుకొని చివరకు విలీనం అంటూ పచ్చి అబద్ధాలు చెప్పిన దగాకోరులు ఎవరని ఆయన ప్రశ్నించారు.
మీ ఫిరాయింపుల బాగోతాలు రాష్ట్ర ప్రజలకు తెలుసనీ, బిఆర్‌ఎస్ నాయకులు సుద్దపూస ముచ్చట్లు ఆపాలని ఆయన ఎద్దేవా చేశారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై కెటిఆర్ పదే పదే ఎందుకు మాట్లాడుతున్నారని, ప్రజలు ఛీత్కరించినా రోజు ఏదో ఒక వంకతో మీడియా కోసం వాగుతున్నారని ఆయన ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు రాకున్నా బిఆర్‌ఎస్ నాయకులకు బుద్ధి రాలేదన్నారు. తెలంగాణలో నూకలు చెల్లే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయన్నారు. తమను, ముఖ్యమంత్రిని ఆడిపోసుకోవడమే ఈ దొంగల ముఠా పనిగా మారిందన్నారు.
ఎమ్మెల్యేలు మోసం చేశారని కెటిఆర్ వేమన శతకాలు చదువుతున్నారని ఆయన ఆరోపించారు. పదేళ్లలో నువ్వు ఫిరాయింపు ఎమ్మెల్యేలతో చేయించింది ఏమిటీ? నువ్వు చేస్తే సంసారం. పక్క వాళ్లు చేస్తే వ్యభిచారమా? ఉప ఎన్నికలు వస్తాయని మాట్లాడుతున్నావు, ఇప్పటికే వచ్చిన ఎన్నికల్లో నువ్వు చేసింది ఏమిటీ? అసెంబ్లీలో ఓడించాం, పార్లమెంట్‌లో చిత్తు చిత్తు చేశాం, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అడ్రస్ లేకుండా చేశామని, ఉప ఎన్నికలు వస్తే నిన్ను, నీ పార్టీని అడ్రస్ లేకుండా చేస్తామని, కెటిఆర్ ఈ సారి మాట్లాడేటప్పుడు నాలుక, ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హెచ్చరించారు.