- ఎక్కడా చూసినా నిరసన సెగలు
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
గ్రామ సభలు అంటేనే అధికారులు భయపడుతున్నారని, ఎక్కడ చూసినా ప్రజలు తిరగబడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గ్రామసభలు రణసభలుగా మారాయంటేనే.. కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్యూర్‌కు నిదర్శనమని హరీష్ రావు చెప్పారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామ సభలో మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం బాధాకరమని హరీష్ రావు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు లేదని ములుగు జిల్లా బుట్టాయిగూడెంలో కుమ్మరి నాగయ్య అనే దళిత రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం మనస్సు కలిచివేసింది. గ్రామ సభల్లో జరుగుతున్న ఇలాంటి వరుస ఘటనలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. తన చావుతోనైనా అర్హులైన పేదలకు పథకాలు ఇవ్వాలని అధికారులకు చెబుతూ పురుగుల మందు తాగి, హాస్పిటల్ పాలైన ఆ రైతన్న దుస్థితికి ప్రభుత్వమే కారణమని హరీష్ రావు మండిపడ్డారు.
పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే యావతో, ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా, లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరపకుండా, జాబితాను విడుదల చేయడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. దీంతో పాటు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలు అంటూ బాహాటంగా ప్రకటించడంతో గ్రామ సభల్లో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పట్ల ప్రజల్లో ఆందళన మొదలైంది. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ఈనెల 26న ప్రారంభిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ, మరోవైపు గ్రామ సభల్లో విడుదల చేసిన జాబితా ఫైనల్ కాదని సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి చెప్పడం హాస్యాస్పదం.
అలాంటప్పుడు నాలుగు రోజుల పరిమితి పెట్టి గ్రామ సభలు నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటి? గ్రామ సభల్లో విడుదల చేస్తున్న అర్హుల జాబితాకు ఉన్న విలువ ఏంది? అని హరీష్ రావు ప్రశ్నించారు. 400 రోజుల పాటు అన్ని వర్గాల ప్రజలను విజయవంతంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ, చారిత్రక గణతంత్ర దినోత్సవం అయిన జనవరి 26న మరో మోసానికి సిద్ధమైంది. దరఖాస్తుల పేరిట ఇంకెన్ని సార్లు ప్రజలను మోసం చేస్తారు రేవంత్ రెడ్డి మీ సేవలో దరఖాస్తులు చేసుకున్నారు. ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నారు. కుల గణనలో వివరాలు తీసుకున్నారు. ఇప్పుడు గ్రామ సభల పేరిట మరో కొత్త డ్రామా చేస్తున్నారు. మళ్లీ దరఖాస్తులు తీసుకుంటున్నారు. ‘ అప్లై అప్లై బట్ నో రిప్లై ’అన్నట్లుంది మీ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు అని హరీశ్‌రావు తీవ్రంగా విమర్శించారు.