- రైతుల అప్పులు ముఖ్యమా.. దావోస్ డప్పులు ముఖ్యమా ?
- మాజీ మంత్రి హరీష్ రావు
దావోస్ పర్యటన గురించి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ప్రెస్ మీట్.. పెట్టుబడుల కట్టు కథను నమ్మించేందుకు శతవిధాలా యత్నించి అట్టర్ ఫ్లాప్ అయినట్లు ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవాచేశారు. . మీ ప్రెస్ రిలీజ్ లు, మీ మీడియా కవరేజ్ లు, మీ ఈనో స్టోరీలు ఎవరూ నమ్మడం లేదని, ప్రెస్ మీట్ పెట్టావు. ఎప్పుడో అయిపోయిన దావోస్ కు ఇప్పుడు ఎందుకు ఈ దావతు. దావోస్‌లో జరిగే ఎంఓయూలు అన్నీ కూడా ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే.. ఎవరైనా ఓపెన్ టెండర్‌లో రావాల్సిందే.. అని ఆర్థిక మంత్రి భట్టి అంటే, మీరేమో లక్షా 82 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చినట్లు గప్పాలు చెబుతున్నారని విమర్శించారు.
భట్టి చెప్పింది నిజమా? మీ మాటలు నిజమా? అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. పొంతన లేకుండా మీరు చెప్పిన కంపెనీలు, పెట్టుబడుల లెక్కలు యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించింది. అంతా డొల్ల ప్రచారమని తేలిపోయింది. రైతు భరోసా కోసం గంపెడాశతో ఎదురుచూస్తున్న రైతుల ఆరాటాన్ని చిల్లర పంచాయితీ అంటవా? ఇంతక ముందు రైతు బంధును బిచ్చం అన్నవు, ఇప్పుడు రైతు భరోసాను చిల్లర పంచాయితీ అంటున్నావు.
సంక్రాంతికి ఇస్తానన్న సంగతి తేలిపోయింది, చబ్బీస్ (26) జనవరి చేదు మాత్రనే అయ్యింది, ఇప్పుడు మార్చి 31 దాకా గడువు పెంచారు. జర్నలిస్టులు ఇదేమని అడిగితే, చిల్లర పంచాయితీ అంటున్నావు. అప్పుల పాలవుతున్న రైతుల ఆవేదన పక్కన పెట్టి మీ ప్రచారం వినాలా? అని హరీష్ రావు ఫైర్ అయ్యారు. రైతుల అప్పులు ముఖ్యమా.? దావోస్ డప్పులు ముఖ్యమా..? మీ సెల్ఫ్ డబ్బాకు, మీ వెకిలి సెటైర్లకు కాలం చెల్లిందని అన్నారు. ముఖ్యమంత్రికి తన మాటలు ఎవరూ నమ్మడం లేదనే ఆందోళన పెరిగిపోయిందని, . మంచి మానసిక వైద్యుడిని సంప్రదించడం మంచిదని హరీష్ రావు ఎద్దేవా చేశారు.