రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి భంగం: మాజీ మంత్రి హరీష్ రావు
సీఎంగా రేవంత్‌రెడ్డి వొచ్చిన తర్వాత నుంచి అక్రమ అరెస్టులు పెరిగాయని, అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నాడని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు విమర్శించారు. బీఆర్‌ఎస్ సీనియర్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టును సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా ఖండిరచారు. ఉదయాన్నే పోలీసులు ఇంటి వద్దకు వచ్చి అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి నోటీసు లేకుండా అరెస్ట్ చేయడం పూర్తిగా అప్రజాస్వామికమన్నారు.
ఇది ఇందిరమ్మ రాజ్యమా.. పోలీస్ రాజ్యమా? అంటూ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. అడిగితే అరెస్టులు.. ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే బెదిరింపులు అంటూ విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నారన్నారు. సెలవు రోజుల్లో కావాలని బీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేస్తూ సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. హోం మంత్రిగా శాంతి భద్రతల నిర్వహణలో విఫలమైన రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించడంపైనే దృష్టి పెట్టారన్నారు. ఈ పైశాచిక ఆనందం ఎక్కువ కాలం నిలవదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మీ పిట్ట బెదిరింపులు, అక్రమ కేసులకు భయపడే వారు మేము కాదని గుర్తుంచుకోండి. తెలంగాణ సమాజమే మీకు తగిన బుద్ధి చెబుతుందని హరీశ్‌రావు ట్వీట్ చేశారు.