Thursday, May 1, 2025

కాంగ్రెస్ పదేళ్లు అధికారం అనేది పగటి కలే..

బసవేశ్వరుడి జయంతిని రేవంత్ చిల్లర రాజకీయాలకు వాడుకున్నారు..
నీ తప్పులన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు..
తగిన సమయంలో వారే బుద్ధి చెబుతారు
‘ఎక్స్‌’వేదికగా సిఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే హరీష్‌రావు వార్నింగ్‌

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి తన పేరును కేసీఆర్‌ పలకాలని ఎన్నో రోజుల నుంచి అడుక్కుంటున్నాడని, కుసంస్కారం, కుంచిత స్వభావం ఉన్న ఆయన పేరును కేసీఆర్‌కు తీయాల్సిన అవసరమేంటీ? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అడిగారు. ఈ మేరకు బుధవారం హరీష్‌రావు ‘ఎక్స్‌’వేదికగా ఓ పోస్టు చేశారు.  శిశుపాలుడి లెక్క తప్పు మీద తప్పు చేస్తున్న నీ వైఖరిని ప్రజలు అందరూ గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి ఎంత దిగజారాడంటే, బసవేశ్వరుడి జయంతిని కూడా చిల్లర రాజకీయాల కోసం వాడుకున్నాడన్నారు. సమ సమాజ స్థాపన కోసం, జాతి, కుల, మత, లింగ వివక్షలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయుడు బసవేశ్వరుడు అని, ఆ మహనీయుడి స్ఫూర్తిని ప్రజలకు చాటాలని, వారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని నాడు కేసీఆర్‌ నిర్ణయించారన్నారు.  రవీంద్రభారతిలో ప్రభుత్వం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అడ్డగోలుగా రాజకీయాలు మాట్లాడన్నారు.

పదో తరగతి ఫలితాల విడుదలను కూడా తన రాజకీయ అవసరానికి వాడుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం పది గంటలకు విడుదల చేయాల్సిన ఫలితాలను, రెండు సార్లు సమయం మార్చి చివరకు రెండున్నరకు విడుదల చేశాడనీ, ఫలితాల కోసం ఎదురు చూసే పిల్లల జీవితాలతో వారం రోజులుగా తేదీలు మార్చి, టైమింగ్స్‌ మార్చి ఆడుకున్నాడన్నారు. విద్యార్థులను ముందు పెట్టుకొని ఎంతో నీచంగా మాట్లాడి ముఖ్యమంత్రి స్థాయిని, హోదాను రేవంత్‌రెడ్డి దిగజార్చాడన్నారు. అచ్చోసిన ఆంబోతు అంటాడు,  సమాధి అంటాడు కనీసం సోయి లేకుండా మాట్లాడన్నారు. ఇదేనా విద్యార్థులకు నువ్వు చెప్పేది రేవంత్‌ రెడ్డి, నువ్వా విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇచ్చేదంటూ మండిపడ్డారు. రవీంద్రభారతిలో రాజకీయాలు మాట్లాడి దాని గౌరవాన్ని తగ్గించాడన్నారు. విద్యార్థుల మెదళ్లలో విషం నింపుతున్న ముఖ్యమంత్రి ఎక్కడా ఉండడనీ, బిఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ సభను చూసినప్పటి నుంచి రేవంత్‌కు నిద్ర పట్టడం లేదనీ,  కళ్లలో, కడుపులో మాత్రమే కాదు నిలువెల్లా విషం నింపుకున్నాడనీ, కడుపులో పెట్టుకున్న విషాన్ని ఆపుకోలేక ఈరోజు బయట కక్కిండన్నారు.

కేసీఆర్‌ గురించి అవే చిల్లర మాటలు మాట్లాడి, కుక్క తోక వంకరే అని మరోసారి రేవంత్‌రెడ్డి రుజువు చేశాడనీ, కేసీఆర్‌ అన్నట్లుగానే కాంగ్రెస్‌ ముమ్మాటికీ తెలంగాణకు విలనేనని అన్నారు. తెలంగాణను కాంగ్రెస్‌ పార్టీ ఇవ్వలేదు, ఉద్యమం చేసి, రాష్ట్రం ఇచ్చే అనివార్య పరిస్థితిని కాంగ్రెస్‌కు కేసీఆర్‌ కల్పించాడన్నారు. అప్పటి  కేంద్రంలోని యూపిఏ సర్కార్‌ మెడలు వంచి కేసీఆర్‌ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడన్నారు. అది ఇచ్చినోళ్ల గొప్పతనమా? సాధించినోళ్ల గొప్పతనమా?అని నిలదీశారు. ప్రజలు కష్టాల్లో ఉంటే ఎందుకు రావడం లేదని నువ్వే అంటున్నావు, మరోవైపు ప్రజలకు కష్టాలు లేవు, మాది ప్రజా పాలన అంటున్నావు రేవంత్‌కు జపాన్‌ వెళ్లి వొచ్చి మైండ్‌ పాడైనట్లుందనీ, లేకుంటే రజతోత్సవ సభకు వొచ్చిన జనాన్ని చూసి మైండ్‌ బ్లాంక్‌ అయినట్లుందన్నారు. సిగ్గులేకుండా ఏ పథకం ఆగిపోయిందో చెప్పాలి అంటున్నాడనీ,  కేసీఆర్‌ కిట్టు ఆగిపోలేదా? దళిత బంధు ఆగిపోలేదా? బిసి బంధు ఆగిపోలేదా? గొర్రెల పంపిణీ ఆగిపోలేదా? రెండు నెలల పింఛన్లు ఆగలేదా? డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు ఆగలేదా? స్కాలర్‌ షిప్స్‌ ఆగలేదా? ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ ఆగలేదా? మీ  15 నెలల పాలనలో ఆగని పథకం ఏదైనా ఉందా? విద్యార్థులను ముందు పెట్టుకొని, ఇచ్చిన మాట మీద నిలబడుతా అని గొప్పలు చెప్పి  సప్పట్లు కొట్టించుకుంటున్నావన్నారు.

నీ ఆరు గ్యారెంటీలు ఏమైయ్యాయనీ,  420 హామీలు ఏమైయ్యాయనీ, ఏడాదిలో  రెండున్నర లక్షల ఉద్యోగాలు ఏమైయ్యాయనీ జాబ్‌ క్యాలెండర్‌ ఏమైందనీ, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఏమైంది, విద్యార్థినులకు స్కూటీ ఏమైంది, మహిళలకు 2500 ఏమైంది, తులం బంగారం ఏమైంది, కౌలు రైతులకు భరోసా ఏమైంది, 15వేల రైతు భరోసా ఏమైందినీ ప్రశ్నించారు. ఇంకా సిగ్గు లేకుండా మాట తప్పను, శత్రువులు కూడా నన్ను ఏమనరు అంటున్నాడన్నారు. ఒక్కసారి నీ మేనిఫెస్టో చూసుకో, నీ మాట తప్పుడు ఏందో నీకే అర్థమవుతుందన్నారు.  నీ సవాల్‌ను నేను స్వీకరిస్తున్నా రేవంత్‌ రెడ్డి…నువ్వు అన్నట్లు కాలేశ్వరం మీద చర్చ పెడుదామా? రుణమాఫీ మీద పెడుదామా? రైతు బంధు మీద పెడుదామా? నీ బోగస్‌ 60వేల ఉద్యోగాల మీద పెడుదామా? కులగణన మీద పెడుదామా? దేని మీదైనా చర్చకు సిద్దం, ప్లేస్‌, టైం నువ్వే చెప్పు అంటూ సిఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు సవాల్‌ విసిరారు.

రుణమాఫీ మీద చర్చ అని ఇప్పటికే తోకముడిచి,  ఇప్పుడు కూడా అలా చేసి తప్పించుకోకు పదేళ్లు అధికారంలో ఉంటా అని పగటి కలలుకంటున్న రేవంత్‌ రెడ్డి, ఉన్న మూడేళ్లు నీ కుర్చి సక్కగ ఉండేలా చూసుకో అని హితవు పలికారు. ఏ పక్క నుంచి ఎవరు వొచ్చి లాక్కుంటరో చూసుకో నువ్వు ఎంత మేకపోతు గాంభీర్యం చూపినా, కాంగ్రెస్‌ సర్కారు అట్టర్‌ ఫ్లాప్‌ అన్నది రోజుకోసారి నిరూపిత మవుతుందన్నారు. ఇదెక్కడి దిక్కుమాలిన ప్రభుత్వం అని అనుకోని ప్రజానీకం ఉందా? అధికారంలోకి వొచ్చిన 15 నెలల్లోనే ఇంత ఘోరంగా విఫలమైన ప్రభుత్వం మరొకటి లేదు, అతి తక్కువ కాలంలో అన్ని వర్గాల ప్రజలతో తిట్లు తింటున్న ఏకైక సిఎం రేవంత్‌రెడ్డేనని ఆ పోస్టులో ఎమ్మెల్యే హరీష్‌రావు పేర్కొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com