- స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు చర్య
- జగదీశ్ రెడ్డి తీరుపై మండిపడ్డ మంత్రులు
- దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణమన్న మంత్రి సీతక్క
- ఎథిక్స్ కమిటీకి అప్పగించాలని కాంగ్రెస్ సభ్యుల డిమాండ్
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి శాసనసభ నుంచి సస్పెండ్ అయ్యారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. సస్పెండ్ అయిన సభ్యుడిని సభ నుంచి బయటకు పంపాలని స్పీకర్ ఆదేశించారు. కాగా.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళం సృష్టించాయి. ‘మీరు మేము ఎన్నకుంటేనే స్పీకర్ అయ్యారు.
సభ ఒక్కరిదీ కాదు – సభ అందరిదీ’ అని స్పీకర్‌ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి అన్నారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతకుముందు జగదీష్ వ్యాఖ్యలపై శాసనసభలో వాడీవేడీ చర్చ జరిగింది. సభ లోపల, బయట స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఏకవచనంతో స్పీకర్‌పై మాట్లాడటం బాధాకరమన్నారు. స్పీకర్‌ను అవమానించకుండా ఆదర్శంగా నిర్ణయం తీసుకోవాలని మంత్రి కోరారు. ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి అప్పగించాలని.. అప్పటి వరకు ఈ సేషన్ మొత్తం ఆ సభ్యున్ని సస్పెండ్ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
జగదీశ్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఈరోజు సభ్యుడు మాట్లాడిన భాష అత్యంత అవమానకరమన్నారు. ఒక దళితజాతి బిడ్డ స్పీకర్‌గా మాట్లాడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని.. స్పీకర్‌ను టార్గెట్ చేయడం బాధాకరమన్నారు. ఆ సభ్యుని సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. జగదీష్ రెడ్డి మాట్లాడిన తీరు జుగుప్సాకరంగా ఉందన్నారు. బలహీన వర్గాలు ఇప్పుడిప్పుడే ఉన్నత స్థానాలను అధిరోహిస్తున్నారని చెప్పుకొచ్చారు.
తమ ప్రభుత్వం వొచ్చాక… బీఆర్‌ఎస్ అడిగినన్ని సార్లు అవకాశం ఇచ్చారన్నారు. జగదీష్ రెడ్డి అత్యంత అవమానకరంగా మాట్లాడారని మండిపడ్డారు. నీకు నీకు అని మాట్లాడడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. గవర్నర్‌ను పట్టుకుని కాంగ్రెస్ కార్యకర్త అని ఎలా అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో గవర్నర్ మాట్లాడింది.. తమ ప్రభుత్వ విధానమని కేసీఆర్ సభలో చెప్పలేదా అని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ను దారుణంగా అవమానించారన్నారు. జగదీష్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని స్పీకర్‌ను కోరుతున్నాని మంత్రి సీతక్క తెలిపారు.
జగదీష్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి: మంత్రి ఉత్తమ్
ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ ప్రసంగం సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌లను సస్పెండ్ చేశారన్నారు. పార్లమెంట్‌లో టీఎంసీ సభ్యుడు ప్రవర్తన సరిగా లేనందున సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. జగదీష్ రెడ్డిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయాలని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. సభ్యులు చర్చ అనంతరం జగదీష్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు.అయితే సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కోరగా.. అందుకు స్పీకర్ అనుమతివ్వక పోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలను సభ నుంచి బయటకు వొచ్చేశారు.
సస్పెండ్ అనంతరం బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో కూర్చున్న జగదీష్ రెడ్డిని అసెంబ్లీ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లాలని చీఫ్ మార్షల్ కోరారు. అయితే సభా వ్యవహారాల నుంచి మాత్రమే సస్పెండ్ చేశారని చీఫ్ మార్షల్‌తో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వాదించారు. ఏ రూల్ ప్రకారం బయటికి పంపాలని చూస్తున్నారని అడిగి రావాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెప్పారు. దీంతో చీఫ్ మార్షల్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.