బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు పంపించారు. బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ల ఆధారంగా నోటీసులు పంపించారు. పార్టీ మార్పుపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వడానికి సమయం కావాలని శాసనసభ కార్యదర్శిని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో కొంత
మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో అనుకూలంగా తీర్పు రాకపోవడంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో ఫిటిషన్ వేసింది. దీంతో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు.
సుప్రీంకోర్టు స్పీకర్‌కు ఆదేశాలు
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి 9 నెలలవుతున్నా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని పిటిషన్లో పేర్కొంది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా ఎస్‌ఎల్‌పీ దాఖలు చేయగా, మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు.