పిఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. తన ఎమ్మెల్యే వేతనాన్ని నియోజకవర్గంలోని అనాథ పిల్లల సహాయార్థం అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో తనను శాసనసభ్యుడిగా గెలిపించారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడటం, సమస్యలను పరిష్కరించడం తన బాధ్యత అని పవన్ పేర్కొన్నారు.
పిఠాపురం ప్రజలు ఇచ్చిన అధికారం ద్వారా వచ్చిన జీతాన్ని అక్కడే వినియోగించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా, నియోజకవర్గ పరిధిలోని తల్లిదండ్రులు లేని పిల్లల భవిష్యత్తు కోసం ఆ మొత్తం ఇస్తున్నట్లు తెలిపారు. తాను పదవిలో ఉన్నంత కాలం వచ్చే జీతం మొత్తాన్ని ఆ పిల్లల సంక్షేమానికి వినియోగిస్తానని ఆయన స్పష్టం చేశారు.
శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు పవన్ కల్యాణ్ తన వేతనం నుంచి ఒక్కొక్కరికి నెలకు రూ. 5 వేల చొప్పున మొత్తం రూ.2 లక్షల 10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. జీతంలో మిగిలిన మొత్తాన్ని కూడా వారి బాగోగులు చూసేందుకే ఖర్చు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.