Monday, February 3, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌ విడుదలైన వెంటనే నామినేషన్ల స్వీకరణ కూడా మొదలైంది. ఈ నెల 10 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 11న నామినేష్ల పరిశీలన, 13న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 27న పోలింగ్‌ జరుగుతుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఉమ్మడి నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ ఉపాధ్యాయ, కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ జిల్లా పట్టభద్రులు, టీచర్‌ ఎమ్మెల్సీల స్థానాలు ఖాళీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎన్నికల అధికారులుగా నల్లగొండ కలెక్టర్‌ త్రిపాఠి, కరీంనగర్‌ కలెక్టర్‌ పమేలా సత్పతి వ్యవహరించనున్నారు.

ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నాలుగు జిల్లాల్లో కలిపి 3,41,313 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో ముగ్గురు థర్డ్ జెండర్లు కూడా ఉన్నారు. కాగా ఈ ఎన్నికల్లో కేవలం గ్రాడ్యుయేట్లు మాత్రమే ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. అంటే డిగ్రీ అర్హత కలిగిన విద్యావంతులు మాత్రమే ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవలసి ఉంటుంది. గతంలో ఈ స్థానానికి మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహించారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ స్థానానికి అల్ఫోర్స్‌ నరేందర్‌రెడ్డిని బలపర్చాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.
మరోవైపు గతంలో రెండుసార్లు ఈ స్థానంలో విజయం సాధించిన బీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల్లో పోటీలో నిలవకూడదని భావిస్తోంది. అయితే పోటీలో నిలిచే ఎవరో ఒక అభ్యర్థికి మద్ధతునిచ్చే అవకాశాన్ని ఆ పార్టీ పరిశీలిస్తోంది. ఇక ఈ జిల్లాల్లో 25,921 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో పట్టభద్రుల కోసం 499, ఉపాధ్యాయ ఓటర్లకు 274 చొప్పున పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఖమ్మం-వరంగల్‌-నల్లగొండ ఉపాధ్యాయ స్థానానికి సంబంధించిన నామినేషన్లను నల్లగొండ కలెక్టరేట్‌లో స్వీకరిస్తున్నారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 12 కొత్త జిల్లాలున్నాయి. 24,905 మంది ఓటర్లుండగా.. 191 మండలాల్లో 200 పోలింగ్‌స్టేషన్లను ఏర్పాటు చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com