రెవెన్యూ వ్యవస్థ ప్రభుత్వానికి కళ్లు, చెవులని, రెవెన్యూ చట్టం ముసాయిదాపై ప్రజాభిప్రాయాన్ని కోరడమే ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత అర్థమవుతుందని ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి అన్నారు. నూతన ఆర్‌ఓఆర్ చట్టంపై ట్రెసా ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి చర్చావేదిక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి ద్వారా రైతులు ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, అదేవిధంగా రెవెన్యూ వ్యవస్థను గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిందన్నారు.
కొత్త రెవెన్యూ చట్టం ఈ సమస్యలకు పరిష్కారం చూపే విధంగా ఉండాలన్నారు. ట్రెసా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంత మంచి కార్యక్రమాన్ని అభినందిస్తూ వారు అందించే సూచనలను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకెళ్లి అన్నీ చట్టంలో పొందుపరిచేలా తాను ప్రయత్నిస్తానని ఆయన తెలియజేశారు. మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కె.నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నూతన రెవెన్యూ చట్టంలో పొందుపరచవలసిన వివిధ అంశాలు, రైతులకు పట్టాదారులకు అందించాల్సిన సేవలను వారు వివరించారు.
నూతన చట్టంపై తగిన సూచనలు అందచేస్తాం: వంగా రవీందర్ రెడ్డి
ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కొత్త చట్టం చేసే ముందు వివిధ వర్గాల నుంచి సూచనలను తీసుకోవడం శుభ పరిణామమన్నారు. అదే విధంగా నూతన చట్టం అమలుకు సంబంధించి అసోసియేషన్ ద్వారా తగిన సూచనలు చేస్తామన్నారు. కొత్త చట్టంలో ఆరీఓవోకు అప్పీలేట్ అథారిటీ, అదనపు కలెక్టర్ రెవెన్యూ స్థాయిలో రివిజన్ అథారిటీ ఉండాలని, అలాగే ఇతర శాఖలకు బదలా యించిన విఆర్‌ఓలను, విఆర్‌ఏలను తిరిగి రెవెన్యూలోకి తీసుకొని గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థను పటిష్ట పరచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా రెవెన్యూ ఉద్యోగులు రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు ఎంతో విలువైన సేవలు అందిస్తున్నారని, రాత్రింబవళ్లు పని చేసి భూసమస్యల పరిష్కారంతో పాటు అత్యవసర విధులతో సహా ప్రభుత్వం చేపట్టే అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు విజవంతం చేస్తున్నారని, రెవెన్యూ వ్యవస్థ బలంగా ఉంటేనే అది సాధారణ ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు.