-
తెలంగాణ డబ్బు ఢిల్లీకి చేరుతుంది
-
కాళేశ్వరం ప్రాజెక్టుతో బీఆర్ఎస్ దోచుకుంది
-
ఇప్పుడు కాంగ్రెస్‌కు ఏటీఎంలా తెలంగాణ
-
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కమీషన్లు తీసుకున్నారు
-
జగిత్యాల సభలో ప్రధాని మోడీ
టీఎస్, న్యూస్: ఆంగ్లేయులు, రజాకార్లతో పోడాడని తెలంగాణ నేలను, ఇక్కడి ప్రజలను బీఆర్ఎస్ దోచుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇదే రాష్ట్రాన్ని తమ ఏటీఎంగా మార్చుకుందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. ఒక దోపిడీదారు.. మరో దోపిడిదారుపై పోరాడలేరని, అందుకే బీఆర్ఎస్ దోపిడిపై కాంగ్రెస్ మౌనం వహిస్తుందని మండిపడ్డారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను ఓడించి తెలంగాణ వికాసం కోసం బీజేపీకి ఓటు వేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాలలో జరిగిన విజయసంకల్ప సభలో మోదీ మాట్లాడారు. తెలంగాణలో బీజేపీకి రోజురోజుకి ఆదరణ పెరుగుతోందన్నారు. మే13న తెలంగాణ ప్రజలు చరిత్ర సృష్టిస్తారని.. వికాసం కోసం బీజేపీకి ఓటు వేయాలన్నారు. జూన్4న వచ్చే ఫలితాల్లో ఎన్డీయే 400 సీట్లు గెలవాలని ఆకాంక్షించారు. విపక్షాల ఇండియా కూటమిలో ఐక్యత లేదన్నారు. కూటమిలో పార్టీలన్ని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారన్నారు. ముంబయిలో జరిగిన రాహుల్ గాంధీ న్యాయ జోడో యాత్రను ప్రస్తావిస్తూ.. విపక్షాల అనైక్యత ఆసభలో కనిపించిందన్నారు. రాహుల్‌గాంధీ శక్తిపై తమ పోరాటం అన్నారని.. శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ 4న తేలిపోతుందన్నారు. శక్తిని నాశనం చేయాలని విపక్ష కూటమి భావిస్తోందన్నారు. తెలంగాణ కలలను కాంగ్రెస్ నాశనం చేసిందన్నారు. కవిత అరెస్ట్‌పై మోదీ మొదటిసారి స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. తెలంగాణ డబ్బు మొత్తం ఢిల్లీకి చేరుతుందని ప్రధాని దుయ్యబట్టారు.
ప్రధాని తన ప్రసంగంలో మహిళలపై ప్రసంశలు కురిపించారు. ఉమెన్ పవర్ చాలా శక్తివంతమైనదన్నారు. మహిళలంతా తమ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలన్నారు. మహిళా శక్తిని కాంగ్రెస్ ప్రభుత్వం హేళన చేస్తోందని. మహిళలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవం లేదని విమర్శించారు.
తెలంగాణ కాంగ్రెస్ఏటీఎం
తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ఏటీఎంలా వాడుకుందని ప్రధాని మోదీ విమర్వించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే పని చేస్తోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి ప్రభుత్వాలేనని విమర్శించారు. బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ విచారణ చేయించడం లేదన్నారు. బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ కవర్ చేయాలని చూస్తోందని, తాము మాత్రం అవినీతి పరులను వదిలిపెట్టేది లేదని మోదీ వార్నింగ్ ఇచ్చారు.
నన్ను తిట్టడమే వాళ్ల పని
కాంగ్రెస్, బీఆర్ఎస్ పని తనను తిట్టడమేనని ప్రధాని మోదీ విమర్శించారు. రోజంతా మోదీని తిట్టడానికి వాళ్ల సమయం కేటాయిస్తున్నారన్నారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ గ్యారంటీ ఉందన్నారు. కుటుంబ పార్టీలను ప్రజలు దూరంగా పెట్టాలన్నారు. దేశాన్ని దోచుకోవడమే కుటుంబ పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు.