కలియుగ ప్రత్యక్ష్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు ఆందోళనవ వ్యక్తం చేస్తున్నారు. తిరుమల లడ్డూ వివాదం ఆఖరికి సుప్రీం కోర్టును కూడా తాకింది. గత వైసీపీ పాలకుల వైఫల్యమేనంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది.టీటీడీ లడ్డూ తయారీపై ఏపీ ప్రభుత్వ ఆరోపణలు, దేశవ్యాప్త ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.
కల్తీ నెయ్యి సరఫరా చేసిన కంపెనీలపై మోదీ సర్కార్ సీరియస్ అయ్యింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన FSSAI… టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీకి నోటీసులు జారీ చేసింది. కల్తీ నెయ్యి సరఫరాకు సంబందించి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. ఐతే ఏఆర్ డెయిరీ మాత్రం టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి కల్తీకి పాల్పడలేదని చెబుతోంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి స్వఛ్చమైన నెయ్యినే పంపించామని, అన్ని రకాల క్వాలిటీ చెక్ చేశాకే కంపెనీ నుంచి నెయ్యి వెళ్లిందని చెబుతోంది. ఇటువంటి సమయంలో ఏఆర్ డెయిరీకి FSSAI నోటీసులివ్వడం ఆసక్తికరంగా మారింది.