ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల విదేశీ పర్యటనకు ఆయన బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రయాణిస్తున్న విమానానికి ఉగ్ర బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. మోదీ ఫ్లైట్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి జరగవచ్చని తమకు సమాచారం వచ్చినట్లు ముంబయి పోలీసులు తెలిపారు.
ఫిబ్రవరి 11న ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. విదేశీ పర్యటనలో ఉన్న మోదీ విమానంపై ఉగ్రదాడి జరగొచ్చని ఫోన్ చేసిన వ్యక్తి బెదిరించాడు. సమాచారంలో ఉన్న తీవ్రత దృష్ట్యా మేం వెంటనే ఇతర దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేశాం. ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తి ఎవరనే విషయమై దర్యాప్తు చేస్తున్నాం అని ముంబయి పోలీసులు చెప్పారు.
ఇక పోలీసులు దర్యాప్తు తర్వాత ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని, దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈరోజు కృత్రిమ మేధ కార్యాచరణ సదస్సులో పాల్గొని.. అనంతరం ప్రధాని అమెరికా వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు యూఎస్ లో పర్యటించి అగ్రరాజ్యం కొత్త అధ్యక్షుడు ట్రంప్ ను కలవనున్నారు.