ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ పాన్ ఇండియా కేటగిరీలో విడుదలై సంచలన విజయం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రతిష్ఠాత్మక ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్స్ సహా హాలీవుడ్ క్రిటిక్స్ పురస్కారాలు దక్కాయి. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు…’కు ఆస్కార్ దక్కడం అరుదైన చరిత్ర. అయితే ప్రపంచ స్థాయిలో ఆర్.ఆర్.ఆర్ చిత్రం గుర్తింపు దక్కించుకున్న ప్రతిసారీ భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. భారతీయ సినిమా ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కించుకోవడాన్ని ఆయన బహిరంగంగా కీర్తించారు. ఆర్.ఆర్.ఆర్ సినిమాని, దర్శకధీరుడు రాజమౌళి ఇతర నటీనటుల బృందాన్ని పీఎం ప్రశంసించారు. ఇప్పుడు వేవ్స్- 2025 సమ్మిట్ లో మరోసారి ఆర్.ఆర్.ఆర్ సాధించిన ఘనతపైనా, రాజమౌళి వల్ల దక్కిన గుర్తింపు పైనా మోదీ ప్రశంసలు కురిపించారు. భారతీయ సంస్కృతిని ప్రపంచ దేశాలకు పరిచయం చేయడంలో మన సినిమా ఎంతగానో సహకరించిందని, ఆర్.ఆర్.ఆర్ కు ఆస్కార్ దక్కడమే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. 1913లో మొట్టమొదటి చిత్రం ‘రాజా హరిశ్చంద్ర’ విడుదలైంది. దాదాసాహెబ్ ఫాల్కేజీ సినిమాని మరో స్థాయికి చేర్చాడు. రాజ్ కపూర్, సత్యజిత్ రే వంటి ప్రముఖులు సినిమాని పెద్ద స్థాయికి తీసుకుని వెళ్లారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా ఆస్కార్ ని అందించింది. ఏ.ఆర్.రెహమాన్, రాజమౌళి వంటి ప్రముఖులు భారతీయ సినిమాని ప్రపంచ స్థాయిలో ఆవిష్కరించారని కూడా మోదీజీ ప్రశంసించారు. పీఎం మోదీ సినిమా రంగం సహా డిజిటల్ రంగంపైనా ప్రసంగించారు. ఈసారి ముంబైలో గ్లోబల్ స్థాయిలో జరుగుతున్న వేవ్స్ సమ్మిట్ 2025లో తెలుగు నటులకు ప్రాధాన్యతనిస్తూ పలువురిని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, దర్శకదిగ్గజం రాజమౌళి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్లకు వేవ్స్ లో సమీక్షా సమావేశాల కోసం పిలుపు అందింది.