-
రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని లాజిస్టిక్ సేవల కేంద్రాల
-
ఏర్పాటుకు ఆర్టీసి అధికారుల యత్నం
-
ఏడాదికి రూ.300ల నుంచి రూ.500 కోట్ల ఆదాయం..!
-
ప్రణాళికలు రూపొందించిన టిజి ఆర్టీసి
-
ప్రైవేటు సంస్థలతో కలిసి ఇంటి వద్దకే పార్శిళ్లు, పికప్, డెలివరీ
ఆర్టీసికి ప్యాసింజర్ టికెట్ ఆదాయం 97 శాతం వస్తుండగా టికెట్ యేతర ఆదాయం 3 శాతం వస్తోంది. ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకోవాలని ఆర్టీసి నిర్ణయించింది. అందులో భాగంగా ఆర్టీసిలో లాజిస్టిక్ సేవలు పెంచుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. గత సంవత్సరం ప్రతి రోజు సగటున 15 వేల పార్శిళ్లను ఆర్టీసి బట్వాడా చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో 60 లక్షల పార్శిళ్లను టిజి ఆర్టీసి బస్సుల్లో రవాణా చేశారు. ఆ పార్శిళ్ల రవాణా వల్ల ఆర్టీసికి సుమారు రూ.120 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఈ ఆదాయాన్ని మరింత పెంచుకోవాలన్న ఉద్ధేశ్యంతో ప్రత్యామ్నాయ ఆదాయం పై సంస్థ దృష్టిపెట్టింది. అందులో భాగంగా లాజిస్టిక్ సేవలను వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేలా త్వరలోనే పార్శిళ్లను ఇంటి వద్దనే పికప్, డెలివరీ చేసేందుకు ఆర్టీసి చర్యలు చేపట్టింది. ఇప్పటికే లాజిస్టిక్ సేవలను అందించేందుకు దిల్‌సుఖ్‌నగర్‌లో ఒక కౌంటర్‌ను ప్రారంభించిన ఆర్టీసి త్వరలో మరిన్ని కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు సిద్ధం అవుతోంది. లాజిస్టిక్ సేవల ద్వారా ఏడాదికి కనీసం రూ.300ల నుంచి రూ.500 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
రాష్ట్ర పరిధిలో వివిధ నెట్‌వర్క్‌ల ద్వారా రూ. వెయ్యి కోట్ల కార్గో వ్యాపారం
తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే వివిధ నెట్‌వర్క్‌ల ద్వారా దాదాపు వెయ్యి కోట్ల కార్గో వ్యాపారం జరుగుతోంది. ఇక తెలంగాణ నుంచి ఎపికి కార్గో వ్యాపారం రూ.800 కోట్ల వరకు ఉంటుంది. అదే ఆర్టీసి సొంతంగా తమ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకొని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో లాజిస్టిక్ కౌంటర్లను ఏర్పాటు చేసి వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తే ఆదాయం మరింత పెరుగుతుందని ఆర్టీసి అధికారులు భావిస్తున్నారు. దీనికి తోడు ఆర్టీసికి కార్గో ఆదాయం పెరగడానికి ఆ సంస్థకు అనువైన వ్యవస్థ ఉంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసి ఆక్యుపెన్సీ కూడా బాగా పెరిగింది. దాంతో పాటు పార్శిల్, లాజిస్టిక్ ద్వారా కూడా ఆదాయాన్ని పెంచుకునేందుకు కార్గో సేవలను విస్తరించాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. ముఖ్యంగా ప్రజల ఇళ్ల వద్దకే వచ్చి పికప్, డెలివరీ సేవలను అందించేందుకు ప్రైవేటు వ్యక్తులతో కలిసి పని చేయాలని ఆర్టీసి నిర్ణయించింది. దీని వల్ల ప్రజలకు చాలా తక్కువ వ్యయంతోనే ప్రైవేటు సంస్థలకు ధీటుగా సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని ఆర్టీసి అధికారులు భావిస్తున్నారు. కేవలం లాజిస్టిక్ సేవలపైనే కాకుండా మరికొన్ని ఇతర సేవల ద్వారా కూడా టిజి ఆర్టీసి ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే లాజిస్టిక్స్ సేవలకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ నంబర్ 040-69440069 లేదా, https://www.tsrtclogistics.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.